అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం స్పష్టంగా బట్టబయలైంది. అనైతికంగా ఒక ఎమ్మెల్సీ సీటును గెలిచి ఏదో గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ బాగోతం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సాక్షిగా బయటపడింది. రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాకను కొనేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. రూ. 10 కోట్లు అంటూ రాపాకను కొనేందుకు టీడీపీ పావులు కదిపింది.
టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇందుకు మధ్యవర్తిత్వం వహించారు. రాపాకను ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలని యత్నాలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ. 10 కోట్లు అంటూ ఆఫర్ తెచ్చారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. టీడీపీకి ఓటేస్తే ఎన్నో ప్రయోజనాలు అంటూ రాపాకను ప్రలోభ పెట్టే యత్నం చేశారు ఎమ్మెల్యే మంతెన. అయితే రాపాక మాత్రం కుదరదని తేల్చి చెప్పడమే కాకుండా తాజాగా ఆ విషయాన్ని మీడియా ముఖంగా బయటపెట్టడంతో టీడీపీ బండారం బట్టబయలైంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ తనకు రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. తన ఓటు అమ్మితే రూ. 10 కోట్లు వచ్చేదని, తన వద్ద డబ్బు ఉండి వద్దనలేదని, ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేమనే తనకు ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు.
‘నా ఓటు కోసం నా మిత్రుడు కేఎస్‌ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారు. అసెంబ్లీ దగ్గర కూడా టీడీపీకి ఓటేయమని ఓ రాజుగారు కోరారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని చెప్పారు. సిగ్గు, శరం విడిస్తే నాకు రూ. 10 కోట్లు వచ్చేవి. ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేం’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేయాలని మొదటి ఆఫర్ తనకే వచ్చిందన్నారు రాపాక.
కాగా, గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడానికి నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే యత్నంలో టీడీపీ అధినేత చంద్రబాబే డైరెక్ట్‌గా మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇదే ప్రలోభాలకు పాల్పడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment