( ఫైల్ ఫోటో )
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ(శాసనమండలి) ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో.. తప్ప మిగిలిన అన్నిటిని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. దీంతో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకుంటోంది. తప్పు లేదు. వందకు వంద మార్కులు వస్తాయని భావించిన వారు రెండు మార్కులు తగ్గితే బాధపడతారు. అదే సున్నా మార్కులు వస్తాయని అనుకున్నవారు రెండు మార్కులు వచ్చినా ఎగిరి గంతేస్తారు. అలాగే ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి.
టీడీపీ నేతలంతా మొత్తం సాదారణ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేసినంత హడావుడి చేస్తున్నారు. తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటివి అయితే శరభ.. శరభ అంటున్నాయి. ఈనాడు అయితే ఏకంగా తిరుగుబాటు అనే హెడింగ్ పెట్టి ఆత్మ సంతృప్తి చెందింది. తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ అక్రమాలను బయటపెడతారా? అనే అక్కసు అందులో కనిపిస్తోంది.
సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ఫలితాల తర్వాత సమీక్షించుకుని తన బలాన్ని బెరీజు వేసుకుంటుంది. ఇక్కడ గమ్మత్తు అయిన అంశం ఏమిటంటే పశ్చిమ,తూర్పు రాయలసీమలోని టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు రెండిటిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటే దానిని ఏదో మామూలు విషయంగా చూస్తున్న టీడీపీ, రెండు చోట్ల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో గెలవడం చాలా పెద్ద విషయం అనుకుంటోంది. స్థానిక సంస్థల నియోజకవర్గాలు తొమ్మిదింటికి గాను ఐదింటిని వైసీపీ ఏకగ్రీవంగా నెగ్గింది. మరో నాలుగింట టీడీపీ మద్దతుతో కొందరు పోటీచేసినా ఫలితం దక్కలేదు.. పశ్చిమగోదావరి వంటి చోట్ల వైసీపీకి ఉన్న బలం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయట. ఆ సంగతిని టీడీపీ మీడియా కప్పిపుచ్చే యత్నం చేస్తోంది.
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలలోని గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో టీడీపీ గెలవడంతో వైసీపీకి పతనం ఆరంభం అయిందని టీడీపీ సీనియర్ నేతలంతా స్టేట్మెంట్లు ఇచ్చేశారు. గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న వాదన చేసేవారు టీచర్లలో ప్రభుత్వ సానుకూలత ఉందని ఒప్పుకోవలసి ఉంటుంది. నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయా అంటే అది పరిమితం అని చెప్పాలి. అలా అని అసలు ప్రాధాన్యత లేదని కాదు. కానీ గ్రాడ్యుయేట్లు ముందుగా తమ ఓటును రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నా ఏభై లక్షల మందికి పైనే గ్రాడ్యుయేట్లు ఉండాలి. కానీ అధికారికంగా ఓట్ల సంఖ్య మాత్రం తొమ్మిది లక్షలే!.
.. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఇతర రంగాలలోని గ్రాడ్యుయేట్లు ఉండవచ్చు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను, టీచర్లను టీడీపీ కాని, ఆ పార్టీ మీడియా కానీ, విపరీతంగా రెచ్చగొడుతున్నాయి. బహుశా ఆ ప్రభావం కొంతమేర పడి ఉండడం వల్ల గ్రాడ్యుయేట్ సీట్లలో వైసీపీకి నష్టం కలిగి ఉండవచ్చు. లేదా అభ్యర్థి ఎంపికలో లోపం ఉండవచ్చు. పార్టీ నాయకత్వంలో సమన్వయ లోపం కారణం కావచ్చు. అతి విశ్వాసం కూడా ఉండి ఉండవచ్చు. విశాఖలో అయితే పార్టీలకు అతీతంగా చిరంజీవిరావుకు ఓట్లు పడ్డాయట. దానికి కారణం ఆయన గ్రూప్ పరీక్షలకు భోధన చేసే లెక్చరర్ కావడమట. అది టీడీపీకి కలిసి వచ్చింది. మరి టీడీపీ స్థానిక సంస్థల నియోజకవర్గాలలో కానీ, టీచర్ల నియోజకవర్గాలలో కానీ ఓటమి చవిచూడడానికి కూడా కారణాలు ఉంటాయి కదా? వాటిని విస్మరించి టీడీపీ వారు కేవలం గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో గెలిచినందుకే రెచ్చిపోతే వారికి ఎంత ప్రయోజనమో తెలియదు.
నిజానికి గతంలో గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. ప్రధాన రాజకీయ పార్టీలు స్వయంగా రంగంలో దిగేవికావు. కానీ కాలక్రమేణా అభ్యర్దులకు పరోక్ష మద్దతు, తదుపరి ప్రత్యక్షంగా పార్టీలే రంగంలో దిగడం జరిగింది. టీచర్ల స్థానాలో ఎక్కువగా వామపక్షాలకు సంబందించిన సంఘాల నేతలు పోటీపడేవారు. గ్రాడ్యుయేట్ల స్థానాలలో బీజేపీ, వామపక్షాలు అధికంగా పోటీ పడేవి. దానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకే పరిమిత ఓటర్లు ఉండే ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇవి ఎక్కువగా దృష్టి పెడుతుండేవి. ఈసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీపడడంతో వామపక్షాల సంఘాల అభ్యర్దులు, బీజేపీ అభ్యర్థులు పూర్తిగా తెరమరుగు అయినట్లుగా కనిపిస్తోంది. గతసారి బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన మాదవ్ ఈసారి పరాజయం చెందారు. తెలుగుదేశం మీడియా ఈ ఎన్నికల ఫలితాలపై ఒక విశ్లేషణ ప్రచారం చేస్తోంది. గ్రాడ్యుయేట్ల స్థానాలు వంద శాసనసభ స్థానాల పరిధిలో ఉన్నాయని, అందువల్ల ఈ ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికలకు నాందీ అవుతాయని ఆ మీడియా అంటున్నది. అదే నిజమైతే..
ఎన్నికలు జరిగిన ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం మొదలైన జిల్లాలు స్థానిక సంస్థల నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. అవన్నీ వైసీపీ పరం అయ్యాయి. అంటే ఈ జిల్లాలన్నిటిలో టీడీపీ తుడిచిపెట్టుకుని పోయినట్లు అంగీకరిస్తారా? రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో టీచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ రెండు సీట్లు వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి అవకాశం లేకుండా పోయిందని అంగీకరిస్తారా? ఈ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికనే ఒక అభిప్రాయానికి రావడం కరెక్టు కాకపోవచ్చు.
గత నాలుగేళ్లలో జరిగిన అన్ని ఎన్నికలలో వైసీపీనే గెలిచింది. చివరికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం స్థానిక ఎన్నికలన్నిటిని వైసీపీ గెలుచుకుంది. అందువల్ల టీడీపీ పని అయిపోయినట్లు ఎవరైనా అంటే ఒప్పుకుంటారా? అదే సమయంలో వీటిని ఒక సంకేతంగా తీసుకోవడం ఆక్షేపణీయం కాదు. ఆ రకంగా చూసినా టీడీపీ గ్రాడ్యుయేట్ల స్థానాలలోనే గెలిచింది. మిగిలిన అన్ని వైసీపీనే గెలుచుకుంది. మండలి ఎన్నికలలో గెలిచినంత మాత్రాన సాదారణ ఎన్నికలలో గెలవాలని లేదు. ఉత్తరాంద్రలో గతసారి బీజేపీ అభ్యర్ధి మాధవ్ మండలికి గెలిచినా, ఆ తర్వాత జరిగిన సాదారణ ఎన్నికలలో బీజేపీకి ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాలేదు.
పీడీఎఫ్ పేరుతో వామపక్ష అభ్యర్దులు పోటీ చేస్తుంటారు. ఉదాహరణకు ఏలూరులో సూర్యారావు అనే టీచర్ వామపక్షవాది. ఆయన మండలి ఎన్నికలలో గెలిచారు. ఆ తదుపరి శాసనసభ ఎన్నికలలో ఆ ప్రాంతంలో సీపీఎం విజయం సాదించలేదు. పీడీఎఫ్ అభ్యర్దులు గెలిచిన జిల్లాలలో శాసనసభ ఎన్నికలలో వారి ప్రభావం ఏమీ కనిపించలేదు. తెలంగాణలో గతంలో బీజేపీ నేత ఎమ్. రామచంద్రరావు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో గెలుపొందారు. కానీ ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. తెలుగుదేశం పార్టీ తనకు ఈ రెండు చోట్ల గెలవడం ఎంతో ఉపయోగంగా సహజంగానే భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రజలను ప్రభావితం చేసి శాసనసభ ఎన్నికలలో ఫలితం రాబట్టడానికి తంటాలు పడుతోంది.
కానీ శాసనసభ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది సమయం ఉందన్న సంగతి మర్చిపోరాదు. తాము రెండు చోట్ల గెలిచాము కాబట్టి మండలి ఎన్నికలలో అక్రమాలు జరగలేదని టీడీపీ చెబుతుందేమో తెలియదు. తొలుత తన విజయం మీద నమ్మకం లేక టీడీపీ వర్గాలు అసలు కౌంటింగే జరగరాదని ఏకంగా కోర్టుకే వెళ్లారు. పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ ఆ విషయం చెప్పడం లేదు.
గతంలో నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిన తర్వాత ఇంకేముంది.. 2019 శాసనసభ ఎన్నికలలో కూడా తమదే గెలుపు అని టీడీపీ నేతలు బీరాలు పోయేవారు. కానీ 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం మూటకట్టుకోగా, వైసీపీ ఘన విజయం సాధించింది. ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నా టీడీపీ అధినాయకత్వం మండలి ఎన్నికల ఫలితాలపైనే ఇంత ప్రచారం చేయడం కేవలం ప్రజలను ప్రభావితం చేయాలన్న ఆశతోనే. కానీ అసలు ఎన్నికలకు ఇంకా ఏడాది టైమ్ ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి.
వైఎస్సార్ సీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో ఒక మాట అన్నారు. పెత్తందారులకు, సామాన్యులకు పోరాటం జరుగుతోందని, తన నడక సామాన్యులతోనేనని, పేదల సంక్షేమం, అభివృద్ధే తన లక్ష్యమని ఆయన స్పష్టంగా చెప్పారు. శాసనసభ సాదారణ ఎన్నికలలో పేద, మధ్య తరగతి ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇంతకాలం ప్రభుత్వానికి వారే అండగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అందుకు భిన్నంగా ఉంటారని అనుకోజాలం. గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలలో గెలవలేకపోవడం వారికి కొంత అసంతృప్తి కలిగించవచ్చేమో కానీ.. అవే వచ్చే శాసనసభ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావించవలసిన అవసరం లేదు.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment