
చాలామందికి వృద్ధాప్యంలో తమ భవిష్యత్తు తెలిసిపోతుందట అంటే ఎప్పుడు తమ జీవితం ముగుస్తుంది.. తమ అడుగులు ఎప్పుడు తడబడతాయి.. తమ ముందు రోజులు ఎలా గడుస్తాయి ఇత్యాది అంశాలు లీలగా కళ్ళముందు కదలాడుతాయన్నమాట. అంటే భవిష్యత్ తమకు దృగ్గోచరమవుతుంది. దాదాపు నలభయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకు సైతం తన భవిష్యత్ అర్థమైపోయిందా? .
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమపార్టీ ఓడిపోతే చంద్రబాబు ఇక మెల్లగా రాజకీయ చిత్రపటం నుంచి వైదొలుగుతారా? అంటే ఆయనే అవునని చెప్పేశారు. ఓ జాతీయ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన రానున్న ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పేశారు. మంచిదే.. ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే.. ఎందుకంటే ఇప్పటికే 74 ఏళ్ళ వయసులో ఉన్న అయన ఆ తరువాతి ఎన్నికలు అంటే 2029 నాటికి ఎనభైకి దగ్గరపడతారు. అప్పటివరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పార్టీని నిలబెట్టుకోవడం పదేళ్లుగా అధికారంలోకి సంపూర్ణంగా శుష్కించిపోయిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు కల్పించి మళ్ళీ 2029లో పార్టీని నడపడం అసాధ్యం అని చంద్రబాబుకే కాదు ఆయనబాబు లోకేష్ బాబుకు ఆయన బాబు దేవాన్ష్ బాబుకు కూడా తెలుసు..
ఇప్పటికే తెలుగుదేశం-జనసేనలమధ్య సీట్ల పంచాయితీ తేలడం లేదు.. ఎన్నికలు దగ్గరపడుతున్నా.. ఎవరికీ ఏ సీట్ అనేది తెలీడం లేదు.. జనసేనకు ఎక్కడ ఇస్తారో.. ఏవి ఇస్తారో ఎవరికీ క్లారిటీ లేదు.. చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నాడు.. సీనియర్ సార్వాడు చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించాడు కదా అని ఊరుకోకుండా పవన్ కళ్యాణ్ కూడా ఎకాఎకిన వచ్చి రాజానగరం, రాజోలు మావే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ షాక్ నుంచి టీడీపీ కోలుకోలేదు.. పొరపాటున రేపెక్కడో ఇంకోసీటు కానీ చంద్రబాబు కానీ ప్రకటిస్తే పవన్ కూడా సీట్లు ప్రకటించి అంతా గందరగోళం చేస్తాడేమో అని భయం పట్టుకుంది.
మరోవైపు రెండు పార్టీలు కూర్చుని ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తారట. అదెప్పటికీ అవుతుందో తెలీదు.. ఇలా వాళ్ళంతా కలిసి ప్రయాణం మొదలెట్టేసరికి ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం ఒక విడత ప్రచారం పూర్తి చేస్తుంది.. ఇలా అన్ని విధాలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందంజలో ఉండడంతో చంద్రబాబుకు సైతం రానున్న ఎన్నికల ఫలితాలు ముందే తెలిసిపోయాయని.. అందుకే ఎన్నికల తరువాత రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని తననోటితోనే చెప్పేశారని అంటున్నారు.
- సిమ్మదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment