తన నలభయ్యేళ్ళ కెరీర్లో చంద్రబాబు గతంలో ఎన్నడూ ఎదుర్కొని సందిగ్ధావస్థను ఎదుర్కొంటున్నారు. ముందుకు వెళ్తే నుయ్యి.. వెనక్కి వెళ్తే గొయ్యి అనేలా ఉంది చంద్రబాబు పరిస్థితి. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తన పార్టీకి నష్టం.. పొత్తు లేకపోతె ఎన్నికలకు పోవడం కష్టం.. అనేది ఆయనకు సమజయింది.
ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడం తనకు సింగిల్‌గా అసాధ్యం కాబట్టి ఢిల్లీ పెద్దల పొత్తు, సపోర్ట్ అవసరం అని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసు. దానికితోడు కాపుల మద్దతుకోసం ఇటు పవన్ సైతం కావాల్సి వచ్చింది. దీంతో పవన్, బీజేపీ మధ్యలో టీడీపీ ఇలా ముగ్గురూ పొత్తులో కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
అయితే, ఇప్పుడున్న బీజేపీ గతంలో అద్వానీ.. వాజ్‌పేయ్ కాలం నాటి బీజేపీ కాదు. ఇది మోదీ, అమిత్ షాల సారధ్యంలో ఉన్న టర్బో ఇంజిన్ ఉన్న ఫైటర్ జెట్ లాంటి బీజేపీ. దానికి ఎదురొస్తే తొక్కుకుంటూ పోవడమే తప్ప కలుపుకుని పోవడం అలవాటులేదు. దానికితోడు జాతీయ స్థాయిలో అవకాశవాదానికి బ్రాండ్ నేమ్ అని ముద్రపడిన చంద్రబాబును నమ్మడం ఇప్పుడు బీజేపీకి అవసరం లేదు. గతంలో అంటే 1999, 2014లో బీజేపీ సపోర్ట్‌తో గెలిచిన చంద్రబాబు ఆ తరువాత ఆ పార్టీని దాని నాయకులను ఎలా అవమానించింది అందరికీ తెలిసిందే.
కేవలం పదిహేను సీట్లు పడేసి.. బీజేపీ మద్దతు పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది పవర్ అనుభవిద్దాం అనుకుంటే అప్పుడు చెల్లింది కానీ ఇప్పుడు నడవదు. అవ్వాకావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. కాబట్టి ఈసారి పొత్తులకు వెళ్లిన చంద్రబాబుకు బీజేపీ వాళ్ళు సవాలక్ష కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు నలభైకి పైగా సీట్లు అడుగుతున్నట్లు తెలిసిందే. అంటే బీజేపీకి నలభై.. జనసేనకు కనీసం ఓ పాతిక సీట్లు ఇవ్వకతప్పదు. అంటే మొత్తం అరవై సీట్లు వదిలేసి ఎన్నికలకు వెళ్ళాలి.
ఇలా అరవై వదిలేస్తే అక్కడ టీడీపీ ఆశావహులు ఊరుకుంటారా?. వాళ్ళు చేసే గొడవ అంతా ఇంతా కాదు.. పోనీ ఈ అరవై సీట్లలో జనసేన, బీజేపీ గెలిచేందుకు టీడీపీ వాళ్ళు సహకరిస్తారా అంటే అనుమానమే. దీంతోపాటుగా టిక్కెట్ దక్కని టీడీపీ వాళ్ళు అక్కడ ఖచ్చితంగా పార్టీకి నష్టం చేస్తారు. అలాగని పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ములేదు. దీంతో చంద్రబాబు ఎటు వెళ్ళాలి.. ఎలా వెళ్లాలని తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు.
బీజేపీతో వెళితే మాత్రం వాళ్ళ కండీషన్స్‌ను ఒప్పుకోవాలి. లేకుండా వెళ్తే.. ఎన్నికలలోపే గేమ్ ముగిసిపోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్ వేసే ఎత్తులు.. వ్యూహాల ముందు చంద్రబాబు ఎదురు నిలవలేని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్ ఎన్నికల మ్యానేజ్‌మెంట్‌లో విశ్వరూపం చూపించారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నాక ఎందుకు ఊరుకుంటారు. ఆ భయం కూడా చంద్రబాబును నిద్రకు దూరం చేస్తోంది. మరోవైపు పవన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. ఇంకో పదిరోజులు గడిస్తే తప్ప కూటమికి ఏదీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇక, ముఖ్యమంత్రి జగన్ మాత్రం అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment