కూటమి ఉమ్మడి సభలు లేనట్లేనా?
బాబు అతి తెలివి ఢిల్లీకి అర్థమైందా ?
పొత్తు పేరిట పోటు పొడిచిన వైనం తెలిసొచ్చిందా?
బాబుతో మరి వేదిక పంచుకునేది లేదా ?
కూటమి సినిమా అట్టర్ ప్లాప్ అయిందా.. మొదటి ఆటతోనే సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేసారా? మొదటి ఆటే ఆఖరాట అయ్యిందా.. చూస్తుంటే అలాగే ఉంది. కాస్త లేటుగా అయినా పాము విషాన్నే కక్కుతుంది తప్ప పాలను కాదు.. తుమ్మ చెట్టుకు ముళ్ళే వస్తాయి తప్ప పూలు రావు.. అలాగే ఎంతగా మారిపోయాను అని చెప్పి.. కాళ్లావేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అవకాశం వచ్చినపుడు మాత్రం చంద్రబాబు తన అసలు రూపాన్ని బయటకు తీస్తూనే ఉంటారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి ఢిల్లీతో పొత్తు పెట్టుకున్నా ఆయన అంతరంగంలో ఏముందన్నది గుర్తించలేని అమాయకులు బీజేపీలో ఎవరూ లేరు. కానీ, మనిషి మారాడేమో అనుకున్నా లేదు.. ఎందుకు మారతాడు.. ఒరిజినల్ అలాగే ఉంటుంది. అది అవసరం వచ్చినప్పుడల్లా బయటపడుతుంది. దీంతో చంద్రబాబు తత్వాన్ని మరోమారు అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు ఇంకోసారి ఆయనతో వేదిక పంచుకునేది లేదని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. మొన్నామధ్య చిలకలూరిపేటలో జరిగిన ఉమ్మడి వేదిక మీద మోదీ.. చంద్రబాబు.. పవన్ ముగ్గురూ మాట్లాడారు. ఆ తరువాత సీట్ల పంపిణీ జరిగింది.
అక్కడే చంద్రబాబు తీరు మరోమారు బీజేపీ పెద్దలకు అర్థమైంది. ఎక్కడెక్కడో ఉన్న టీడీపీ వాళ్ళను బీజేపీలో చేర్చి తన వదిన అయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా టిక్కెట్లు ఇప్పించుకున్న చంద్రబాబు తీరును చూసి ఢిల్లీ బీజేపీ పెద్దలకు మైండ్ బ్లాక్ అయ్యిందట. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు టిక్కెట్లు లేకుండా ఎంతసేపూ సీఎం రమేష్, సుజనా చౌదరి.. ఇలాంటి వాళ్ళు తప్ప వేరేవాళ్లు అభ్యర్థులే లేరా?. అంతా తన చంచాలేనా.. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరూ అభ్యర్థులు కాలేక పోయారా? అంటూ రాష్ట్ర పాతకాపులైన బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదు చూశాక అర్థమైంది. పీవీఎన్ మాధవ్.. వీర్రాజు వంటి వాళ్లకు ఎక్కడా టిక్కెట్లు లేకుండా చంద్రబాబు తన బంధువు పురంధేశ్వరి ద్వారా చక్రం తిప్పి బీజేపీని తన గుప్పిట్లో పెట్టుకుని ఎలా కథ నడిపింది బీజేపీకి అర్థమైంది.
దీంతో, ఇక చాలు ఆయనతో అంటకాగింది చాలు.. కూటమి తరఫున ఇంకో ఉమ్మడి సభ వద్దే వద్దు అని తీర్మానించారని తెలుస్తోంది. దీంతో మోదీ, అమిత్ షా వచ్చినా ఇక చంద్రబాబుతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ వాళ్ళతో సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు సైతం ఉమ్మడిగా కాకుండా ఎవరికీ వారే సభలు.. రోడ్డు షోలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కలిసి వెళ్లడం లేదు.
- సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment