పేదవాణ్ణి అంటూ గ్లిజరిన్ ఏడుపులు..
సానుభూతి కోసం పవన్ ఎత్తులు...
అసమ్మతిని డైవర్ట్ చేసేందుకు ప్లాన్
తెలుగుదేశం, జనసేన కూటమి సీట్ల పంపిణీ అంశం బయటపడగానే ఇరుపార్టీల్లో అసమ్మతి గుప్పుమన్నది. తెలుగుదేశంలో కాస్త తక్కువ మోతాదులోనే అసమ్మతి వ్యక్తం అయినా, జనసేనలో మాత్రం తీవ్రత ఎక్కువే ఉంది. కేవలం పాతికలోపు సీట్ల కోసమా ఇన్నాళ్లూ ఎదురుచూసింది.. దానికోసం మేమెందుకు టీడీపీ జెండాలు మోయాలి.. మేము సహకరించేది లేదు అనే అసంతృప్తి జనసైనికులు, కాపు సంఘాల్లో వ్యక్తమవుతోంది. దీంతో కేడర్‌లో వెల్లువెత్తిన ఈ అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పవన్ కళ్యాణ్ సరికొత్త డ్రామాకు తెరతీసినట్లు తెలుస్తోంది.
అందుకే తాను కష్టాల్లో ఉన్నానని, పేదరికంతో బాధపడుతూనే ప్రజలకోసం పార్టీని నడుపుతున్నాను అని చెప్పుకునేందుకు సరికొత్త డ్రామాకు తెరతీసినట్లు చెబుతున్నారు. కేవలం చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని అతి తక్కువ సీట్లకు చంద్రబాబుకు జనసేనను తాకట్టు పెట్టేశారన్న అపవాదును, ఆరోపణలకు తప్పించుకునేందుకు పవన్ కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన ఆస్తులు అమ్ముతున్నట్లు ఒక ప్రకటన చేశారు.
జీరో బడ్జట్ పాలిటిక్స్ చేస్తాను అని, తరచూ చెప్పే పవన్ ఇప్పుడు ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారు?. ఇంతా చూస్తే ఆయన అభ్యర్థుల దగ్గరే డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికితోడు నాగబాబు అయితే ఏకంగా క్యూఆర్ కోడ్ పెట్టి మరీ విరాళాలు వసూళ్లు చేస్తున్నారు. అలాంటి తరుణంలో పవన్ ఆస్తులు అమ్ముతున్నట్లు ఎందుకు ప్రకటన చేశారు. ఎందుకంటే పాపం పవన్ డబ్బుల్లేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆస్తులు అమ్మితే తప్ప పార్టీ నడవదు. ఇంకా ఆయనకు చంద్రబాబు సైతం ప్యాకేజీ ఇవ్వడం లేదు అందుకే పాపం ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీని నడుపుతున్నారు అని కేడర్ అనుకోవాలన్నది ఆయన ఎత్తుగడ అంటున్నారు.
గత ఎన్నికల్లో 2019లో వందకు పైగా నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు కూడా ఎక్కడా సెంటు భూమి అమ్మని పవన్ ఇప్పుడు కేవలం పాతిక సీట్లల్లో పోటీ చేస్తూ ఆస్తులు అమ్ముతున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం జనసేన కేడర్‌ను చల్లబరిచేందుకు.. వారిలో కోపానికి లేపనం పూసేందుకు మాత్రమే అలాంటి పుకార్లు వదులుతున్నట్లు చెబుతున్నారు. సినిమాల్లో ట్రిక్స్చూపించడం ద్వారా ప్రేక్షకులు, అభిమానులను ఆకట్టుకున్న రీతిలోనే ఇప్పుడు పాలిటిక్స్‌లో సైతం ఇలాంటి మ్యాజిక్కులు చేసి ప్రజలను, కాపు సంఘాలను నమ్మించేందుకు ఆయన ఇలాంటి బీద ఏడుపులు ఏడుస్తున్నారని అంటున్నారు. ఎన్ని గ్లిజరిన్ ఏడుపులు ఏడ్చినా ఈసారి కేడర్ నమ్మేది లేదని బుద్ధి చెప్పడం ఖాయమని అంటున్నారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment