సాక్షి, నంద్యాల: టికెట్ల విషయంలో టీడీపీ అధిష్టానం నానుస్తుండడంతో నంద్యాలలో ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడింది. మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కే టికెట్ అని గతంలో చంద్రబాబు చెప్పినా ప్రస్తుత నాన్చుడు ధోరణితో ఆయన ముందుకు కదలడం లేదు. పైగా ఎన్నికల్లో పోటీ చేయాలా... వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఓడిపోయే సీటు నుంచి పోటీ చేసేందుకు నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌చార్జే డైలమాలో ఉండడంతో కార్యకర్తలు తలోదిక్కు చూసుకుంటున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి కంచుకోట. 2017 ఉప ఎన్నికలో తప్ప ప్రతీసారీ వైఎస్సార్ సీపీ హవానే కొనసాగుతోంది. ఇక్కడ నుంచి ఈసారీ గెలవడం అసాధ్యమని ఫరూక్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ క్షేత్రస్థాయి కేడర్ నుంచీ ఆశించినంత మద్దతు లేకపోవడంతో పోటీ చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధంగా లేనని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.
ఫరూక్, బ్రహ్మానందరెడ్డి ఎడమొహం పెడమొహం
మరోవైపు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్ ఎడమొహం పెడమొహంగా మెలుగుతున్నారు. టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా గతేడాది నవంబర్ 27న ఫరూక్ చార్జి తీసుకున్న నాటి నుంచి నేటి వరకు వీరిద్దరూ కలిసింది లేదు. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కలిసి మాట్లాడదామని ఫరూక్ అనేకసార్లు భూమా బ్రహ్మానందరెడ్డిని కోరినా ఫలితం లేకపోయింది.
ఫరూక్ ముఖం చూసేందుకు కూడా భూమా ఇష్టపడడం లేదని చెబుతున్నారు. కేడర్ తన ఆధీనంలో ఉందని, టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని బ్రహ్మం ఆలోచనగా ఉందని అంటున్నారు. ఈ మేరకు కొంతమంది నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ మద్దతు కోరుతున్నారు.
కేడర్‌లో గందరగోళం
ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం కొరవడడంతో కేడర్ గందరగోళంలో పడింది. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం దక్కడం కష్టం.. ఇక కలహాలతో గెలవడం అసాధ్యమన్న భావన కార్యకర్తల్లో నెలకొంది. ఇన్‌చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా పోటీ చేసేందుకు ఫరూక్ తటపటాయింపు, ఇద్దరు నేతల అనైక్యతతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధిష్టానం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment