
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 30 మంది కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ పాకెట్ మనీ ఇస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల విశ్వసనీయతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన సంజయ్.. పార్టీకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన పలువురు నేతలు బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలు కట్టె తుపాకోళ్ల మాటలను మరిపిస్తున్నాయని, రోజురోజుకూ రాష్ట్రంలో చతికిలపడుతున్న బీజేపీని జాకీలు పెట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిజంగా సంజయ్‌కు దమ్ముంటే ఆ నేతల పేర్లు బయటపెట్టాలన్నారు.
చదవండి: మైనారిటీల భద్రత విషయమై ఒబామాకు కౌంటర్ ఇచ్చిన రాజ్ నాథ్ సింగ్