సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు శ్రీరామరక్షగా మారాయన్నారు. ప్రపంచదేశాలన్నీకూడా మోదీ పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రజలకు కమలంపై భరోసా పెరిగి బహ్మరథం పడుతున్నారని, ఫలితంగా బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయమన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని, సీఎం కేసీఆర్ సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం గాడితప్పిందని దుయ్యబట్టారు. అవినీతిరహిత పాలనకోసం టీఆర్‌ఎస్‌ను తరిమి కొట్టి బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
హోర్డింగ్‌లతో దివాలాకోరుతనం
ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు వస్తుంటే స్వాగతించాల్సింది పోయి, టీఆర్‌ఎస్ తన ప్రచార కార్యక్రమాల హోర్డింగ్‌లతో రోడ్లన్నీ నింపేసి దివాలాకోరుతనాన్ని నిరూపించుకుందని మౌర్య దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతంరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment