
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్ పేరిట.. బీఆర్‌ఎస్ స్వేద పత్రం రిలీజ్ చేయడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. బావ, బావ మరది చెమట కక్కి సంపాదించారా? అని కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన.
ఢిల్లీ పర్యటన ముందుకు ఆయన ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఏదో సాధించినట్లు బీఆర్‌ఎస్ స్వేద పత్రం అంటూ రిలీజ్ చేశారు. ఆ బావ, బావ మరిది వాళ్లేదో కష్టపడి చెమట చిందించి సంపాదించినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది. వాళ్లు చేసిన అప్పుల్ని తీర్చాలంటే తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాలి అని భట్టి వ్యాఖ్యాంచారు.
ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్ నేతలు తిన్నవన్నీ కక్కిస్తామని అన్నారు. అది జరిగి తీరుతుంది. జ్యుడీషియల్ ఎంక్వైరీ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది’’ అని అన్నారాయన.
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు భట్టి ఢిల్లీ పర్యటనలో పాల్గొంటారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై పలువురు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం.. కాంగ్రెస్ అగ్రనేతల్ని ఈ ఇద్దరూ కలవనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment