పెద్దపాపయ్యపల్లిలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్. చిత్రంలో డీకే అరుణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: ‘ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో నన్ను సంపు కుంటారా.. సాదుకుంటారా..? నన్ను గెలిపిస్తే పేదల బిడ్డనై సేవ చేస్తా’అని బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ధర్మం తనవైపై ఉందని పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, కేసీఆర్‌కు చెంప చెళ్లుమనిపించేలా తనను గెలిపించాలని కోరారు.
ఈ ఉపఎన్నిక కేసీఆర్ అహంకారానికి, ఈటల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. 2018 ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా చేయాలనుకున్నారని, ఆ తర్వాత ఎన్నికల్లో ఓడించేందుకు కుట్రలు పన్నారని వివరించారు. కరోనా కాలంలో ప్రపంచమంతా భయపడితే తాను మాత్రం నేనున్నానంటూ.. బాసటగా నిలిచానని, మరణించిన వారి అంత్యక్రియలు సైతం నిర్వహించానని గుర్తు చేశారు.
ఆ సమయంలో ప్రతిపక్షాలు ప్రశంసిస్తే కేసీఆర్ ఓర్వలేక బయటకు పంపాలని అప్పుడే ప్రణాళిక రచించారని విమర్శించారు. వెన్నుపోటు పొడిచింది ఈటల కాదని, కేసీఆర్‌ను నమ్ముకుంటే తనకే వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఎన్నికల చరిత్రలోనే హుజూరాబాద్‌లో వందల కోట్లు కుమ్మరించారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ అహంకారి
సీఎం కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీకి ఓటు వేసి కేసీఆర్ ఫాం హౌజ్ వీడేలా చేయాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. తాను గులాబీ జెండాకు ఓనర్లమని కొట్లాడితేనే హరీశ్‌కు మంత్రి పదవి వచ్చిందన్నారు. 2014 వరకు కేసీఆర్ ఒక ఉద్యమకారుడని, ఆ తర్వాత అవినీతిపరుడిగా మారారని అన్నారు. తనను బద్‌నాం చేసి టీఆర్‌ఎస్ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు.
ఈటల అసెంబ్లీకి వెళ్లాలి: డీకే అరుణ
కేసీఆర్ రాక్షసంగా పాలన చేస్తున్నారని, ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్ అహంకారం దించాలంటే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి పంపాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈటల రాజేందర్‌తో కలసి ఆమె పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈటల రాజేందర్ దమ్మున్న వ్యక్తి అని, కేసీఆర్‌ను.. కాసుకో బిడ్డా అని ఎదిరించే ధైర్యమున్న వ్యక్తి అని అన్నారు. ప్రచారంలో బొడిగె శోభ, అశ్వత్థామరెడ్డి, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment