ఈటలను సన్మానిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. చిత్రంలో బండి సంజయ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో ఆట మొదలైంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికలతో మొదలైన ఈ ఆట తెలంగాణ మొత్తానికి అంటుకుని త్వరలోనే టీఆర్‌ఎస్‌ను ఖతం చేయడం ఖాయం’ అని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు గొర్రెలు అనుకున్నారని.. కానీ ప్రజలు తాము పులిబిడ్డలని నిరూపించారని చెప్పారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించిన స్వాగత సభలో ఈటల రాజేందర్ మాట్లాడారు.
‘రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం లో అరిష్టమైన పాలన కొనసాగుతోంది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దానిని ఖతం చేయాల్సిన సమయం వచ్చింది. ఎవరి ఉద్యమాలు, చైతన్యం ద్వారా అధికారంలోకి వచ్చారో.. ఆ ప్రజలనే బానిసలుగా చేయాలనుకున్న సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ ఫలితం చెంప చెళ్లుమనిపించింది. తెలంగాణ ఆకలినైనా భరిస్తుందే తప్ప.. ఆత్మగౌరవాన్ని వదులుకోదనే విషయం మరోసారి నిరూపితమైంది’ అని ఈటల పేర్కొన్నారు.
పోలీసు అధికారులు హుజూరాబాద్ ప్రజలను బెదిరించారని, టీఆర్‌ఎస్ కండువా కప్పుకుంటేనే లాభమంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. దీనిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఎన్నికల సంఘానికి పంపుతానని చెప్పారు. ‘దళితబంధు’ను తెలంగాణ అంతటా అమలు చేయాలని ఈటల డిమాండ్ చేశారు.
ఉద్యమకారులకు వేదిక బీజేపీనే: కిషన్‌రెడ్డి
తెలంగాణ చరిత్రలో హుజూరాబాద్ ఎన్నిక కీలక మలుపు కాబోతోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలు డబ్బులకు లొంగరని మరోసారి నిరూపించి, అద్భుత తీర్పు ఇచ్చారని.. ఈ గెలుపును వారికే అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో చిత్తశుద్ధితో పోరాడిన పార్టీ బీజేపీ అని.. రాబోయే రోజుల్లో ఉద్యమకారులకు నిజమైన వేదిక బీజేపీనే అని స్పష్టం చేశారు.
‘టీఆర్‌ఎస్ నిర్వహించబోయే సభకు విజయ గర్జన కాదు.. కల్వకుంట్ల గర్జన అని పేరు పెట్టుకుంటే బాగుండేది’ అని అన్నారు. బీజేపీలోకి ఉద్యమకారులు, కవులు, మేధావులను ఆహ్వానిస్తున్నామని.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, నిజమైన ఉద్యమకారులను టీఆర్‌ఎస్ నుంచి వెళ్లగొడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ తల్లి.. గడీలో బందీ: సంజయ్
2023లో గోల్కొండపై కాషాయ జెండా ఎగరేసేదాకా విశ్రమించబోమని, గడీలో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించేదాకా పోరాడుతామని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. ‘దళితబంధు’పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 9న హైదరాబాద్‌లో ‘డప్పుల మోత’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్లతో ఈ నెల 16న నిరుద్యోగులు, యువతతో హైదరాబాద్‌లో ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తామని ప్రకటించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్న డిమాండ్‌తో సోమ వారం నుంచి ఆందోళనలు చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో రైతులు వరి పండించి తీరుతారని.. కేసీఆర్ మెడలు వంచి అయినా ఆ పంటనంతా కొనుగోలు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, జి.వివేక్, గరికపాటి మోహన్‌రావు, ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, చంద్రశేఖర్, బాబూమోహన్, విజయరామారావు, రవీం ద్రనాయక్, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ర్యాలీగా తరలివచ్చి..
శనివారం సాయంత్రం అసెంబ్లీ ఎదుట ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఈటల రాజేందర్, ఇతర నేతలు నివాళులు అర్పించారు. తర్వాత ప్రత్యేక వాహనంలో ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఈటలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి.. పౌర సన్మానం చేశారు. అనంతరం సభ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment