హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై యూపీ పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్డడి యత్నం, మరోవైపు ట్యాంక్‌బండ్‌పై క్యాండిల్ ర్యాలీలో హైడ్రా మా చోటుచేసుకుంది. కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు కూడా గాంధీ భవన్ వైపు దూసుకొని రావడం ఇరు వర్గాల ఘర్షణకు కారణమైంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డితో సహా పలువురు ముఖ్యనాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.
అంతకుముందు గాంధీభవన్ నుంచి ఒక్కసారిగా రోడ్లపై దూసుకొని వచ్చారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసు బలగాలు బీజేపీ ఆఫీసు వైపు దూసుకెళ్లిన వారిని అడ్డుకునేక్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. ఒక దశలో ఎంపీ రేవంత్‌రెడ్డి తప్పించుకునే ప్రయత్నంలో గాంధీభవన్ ముందున్న నాంపల్లి రోడ్డుపై పరుగులు పెట్టారు. దీంతో పోలీసులు ఉరుకులు పెట్టి ఆయనను అడ్డుకున్నారు. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ రోడ్డుమీద బైఠాయించి నిరసనకు దిగారు. హాథ్రాస్ బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించడానికి వెళితే అరెస్టు చేస్తారా? అంటూ విరుచుకుపడ్డారు.
గాంధీభవన్ వైపు బీజేపీ కార్యకర్తలు
మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల ముట్టడి సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ చర్యకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ వైపు దూసుకెళ్లారు. రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో గాంధీభవన్, బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఎంపీ రేవంత్‌ను అరెస్టు చేసే క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్ యాదవ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడగా స్వల్ప గాయాలయ్యాయి. రేవంత్, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు.
కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ భగ్నం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రాస్ హత్యాచార ఘటనకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు పలువురిని అరెస్టు చేసి రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment