సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికను దేశంలోని అన్ని ఎన్నికల కంటే ఖరీదైన ఎన్నికగా మార్చారని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శించారు. మంగళవారం బుద్ధభవన్‌లో ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌ను కలిసిన రేవంత్‌రెడ్డి, హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఫిర్యాదు చేశారు. యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హారిక వేణుగోపాల్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీలు వందల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నాయని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎన్నికలు ఏదైనా ఒక సమస్య మీద జరగాలి కానీ, హుజూరాబాద్ ఎన్నికల్లో ఏ సమస్య కూడా చర్చకు రావడం లేదన్నారు. పంపకాలలో వచ్చిన తేడా వల్లే హరీశ్‌రావు, ఈటల మధ్య మాటల యుద్ధం మొదలైందని చెప్పారు.
దళితబంధుపై చర్చకు రావాలి
నిరోషా అనే మహిళ ఉద్యోగాలు, నిరుద్యోగభృతి గురించి మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్తే టీఆర్‌ఎస్ నేతలు దాడి చేయడం ఏమిటని రేవంత్ ప్రశ్నిం చారు. ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసిన బల్మూరి వెంకట్‌పై దాడులు చేశారని, ఆ వెంకట్‌నే హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపామని తెలిపారు. ఇంటికి ఒక్క ఓటు కాంగ్రెస్‌కు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీలకు అవకాశం ఇచ్చినా అక్కడి పరిస్థితులు మారలేదని.. అందువల్ల హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ తోడు దొంగలని, తమ వ్యూహంలో భాగంగానే దళిత బంధును ఆపారని విమర్శించారు. దళితులకు పది లక్షలు అనేదంతా నాటకమన్నారు. దీనిపై కేటీఆర్ నవంబర్ 15 లోపు బహి రంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment