
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 2019 ఎన్నికల్లో సైకిల్ అడ్రస్సే లేకుండా పోయింది. దీంతో టీడీపీ నేతలు తలో దిక్కు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లోని నేతలు పక్క ప్రాంతాలు, పక్క జిల్లాల్లో సెటిల్ అవుతున్నారు. అటువంటిదే ప్రస్తుత నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం. ఇక్కడ టీడీపీకి నాయకుడు లేకపోవడంతో అక్కడున్న కొద్దిపాటి కేడర్ డీలా పడుతోందట.
గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నంద్యాల జిల్లా బనగానపల్లె టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఇన్‌చార్జ్ బీసీ జనార్థనరెడ్డి...ఆ తర్వాత నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్నపుడు కొంత హడావుడి చేసి, ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ నియోజకవర్గాన్ని వదిలేశారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా బనగానపల్లెని చూసి పోతున్నాడు కాని.. వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన ఆయనకు లేదని కేడర్ చెబుతోంది. 2019 ఎన్నికల్లో సొంత అన్న బిసి బాలతిమ్మారెడ్డి దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని టాక్. అయితే జనార్దన్ రెడ్డి మాత్రం తన అన్న గుండె పోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించారనే ఆరోపణలు బనగానపల్లెలో దుమ్ము రేపుతున్నాయి. సొంత అన్నకు న్యాయం చెయ్యలేని నాయకుడు ప్రజలకు ఏమి చేస్తాడనే విమర్శలు సొంత పార్టీలోనే చెలరేగుతున్నాయి.
అక్కడ తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ
2019 ఎన్నికల్లో బనగాపల్లెలో తెలుగుదేశం జెండా ఎగురుతుందని ఆ పార్టీ కేడర్ నమ్మకంతో ఉంది. అయితే రాయలసీమ నాలుగు జిల్లాల్లో కలిపి టీడీపీకి వచ్చింది మూడే స్థానాలు. ఉమ్మడి కడప, కర్నూల్ జిల్లాల్లో అయితే తుడిచిపెట్టుకుపోయింది. బనగానపల్లెలో బిసి జనార్థనరెడ్డి అర్థబలం, అంగబలం వైఎస్సార్‌సీపీ ముందు నిలబడలేక బోర్లా పడ్డాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సొంతింటి కల నెరవేర్చడానికి పూనుకుంటే.. ఆ గొప్పతనం వైఎస్సార్‌సీపీకి వస్తుందనే దురుద్దేశంతో పట్టాల పంపిణీ జరుగకుండా అతని అనుచరులతో కోర్టుల నుంచి స్టే తెప్పించాడు. పేదలకు ఇంటి స్థలాలు రాకుండా చేసిన ఘనత సాధించాడు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జనార్థనరెడ్డి. బిసిపై ప్రజలలో రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతుండటంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నాడని టాక్ నడుస్తోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అయితే టీడీపీ నేత బీసీ జనార్థనరెడ్డి మాత్రం అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందకుండా అడ్డుకుంటూ ప్రజా వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నాడు.