తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు | Tirupati Lok Sabha Elections DR Gurumurthy Won The Seat | Sakshi
Sakshi News home page

తిరుపతి ఉప ఎన్నిక: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డా. గురుమూర్తి విజయం

Published Sun, May 2 2021 3:37 PM | Last Updated on Sun, May 2 2021 7:07 PM

Tirupati Lok Sabha Elections DR Gurumurthy Won The Seat - Sakshi

తిరుపతి ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం వెంటే తామున్నామని స్పష్టం చేశారు. 2 లక్షల 70 వేలపైచిలుకు ఓట్ల మెజార్టీని అందించారు. ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడ్ని అందలం ఎక్కిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి తనానికి ప్రజలు మద్దతు నిచ్చారు. నేటి ప్రజా తీర్పుతో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారు. ఫ్యాన్‌ సునామీలో కొన్ని ప్రత్యర్థి పార్టీల చావు తప్పి కన్ను లొట్టపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మారు మూల గ్రామం.. సామాన్య మధ్య తరగతి కుటుంబం
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామమైన మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దిల గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగుచేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఐదుగురు అక్క చెల్లెల్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో ప్రాథమిక, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. ఆ తర్వాత ఇంటర్‌ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరిపీ పూర్తి చేశారు.

మహానేత స్పూర్తి.. జగనన్న వెన్నంటి..
స్విమ్స్‌లో ఫిజియోథెరపి చేస్తున్న సమయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తరచూ వెళ్లి కలిసేవారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తూ వైఎస్‌ కుటుంబానికి దగ్గరయ్యారు. 2017లో వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ‘ప్రజాసంకల్పయాత్ర’లో ఆయన వెంటే ఉన్నారు. నవంబర్‌ 2017- జనవరి 2019 వరకు 3,648 కి.మీ మేర సాగిన వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఆయన వెంట నడిచారు. అడుగడుగునా పేదల కష్టాలు చూశారు. 

ఫిజియోథెరపిస్టు టు మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌
బీసీ, ఎస్సీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారిని సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో తన వెంటే ఉండి ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్‌ గురుమూర్తిని తిరుపతి ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. సీఎం జగన్‌.. డా.గురుమూర్తి పేరు ప్రకటించిన నాడే ఆయన విజయం ఖరారు అయిపోయింది. ప్రజలు గురుమూర్తిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి సంక్షేమ ప్రభుత్వానికి కొమ్ము కాశారు. ప్రజలపై ముఖ్యమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని.. ప్రజలకు ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకాన్ని తేటతెల్లం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement