మూసీ ప్రక్షాళన చేస్తామని బీఆర్‌ఎస్, బీజేపీ చెప్పలేదా?: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కబళించారు
1500 చెరువుల కబ్జాల్లో 80 శాతం బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలవే
అవసరమైనప్పుడు వారి పేర్లు కూడా బయటకు వస్తాయి
బీజేపీలో ప్రజానాయకులెక్కడున్నారు? ఆ పార్టీలో 80 శాతం నాయకులే కాదు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే బీఆర్‌ఎస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్‌గౌడ్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను ఆ పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టలేదా అని నిలదీశారు. మూసీపై ఒక్క గుడిసె కూడా ప్రభుత్వం తొలగించలేదని, అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అందరూ గ్లోబల్ వారి్మంగ్ గురించి మాట్లాడుతుంటే బీఆర్‌ఎస్ నేతల మెదళ్లకు మాత్రం ఆ ఆలోచన రావడం లేదని వ్యాఖ్యానించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుíÙతమైన నదిగా మూసీ గుర్తింపు పొందిందని, ఇలాంటి పరిస్థితుల్లో మూసీని ప్రక్షాళన చేయడం వల్ల రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 26 లక్షల మందికి మేలు జరుగుతుందన్నారు.
వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు
సోషల్‌మీడియాను ఉపయోగించి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్‌కుమార్ విమర్శించారు. సోషల్‌మీడియా కోసం బీఆర్‌ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ అధికారులను కోరామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్, జన్వాడ ఫామ్‌హౌజ్‌ల చుట్టూ కాదని, చార్మినార్, మూసీలో జరగాలని అన్నారు.
గత పదేళ్లలో 1,500 చెరువులు కబ్జాకు గురయ్యాయని ఇందులో 80 శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసినవేనని ఆరోపించారు. హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కబళించారని, ఈ భూబకాసురులే తమ టార్గెట్ అని, పేద ప్రజలు కాదని స్పష్టంచేశారు. సమయం వచి్చనప్పుడు ఈ భూబకాసురుల పేర్లు బయటకు వస్తాయని, వారు వెళ్లే జైలు పేరు కూడా తెలుస్తుందని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. హైడ్రాతో భయభ్రాంతులకు గురవుతున్నది బీఆర్‌ఎస్ నేతలే తప్ప సామాన్య ప్రజలు కాదని అన్నారు.
తలో దిక్కు దోచుకున్నారు
రాష్ట్రాన్ని పదేళ్ల పాలించిన బీఆర్‌ఎస్ మల్లన్నసాగర్ కట్టేందుకు సీఆరీ్పఎఫ్ జవాన్లతో కొట్టించి మరీ ప్రజలను ఖాళీ చేయించిందని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు తలోదిక్కు దోచుకున్న విషయాన్ని గమనించిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి సున్నా సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక, బీజేపీ నేతల్లో ప్రజానాయకులు ఎవరున్నారని మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ కంటే రైతు మోసగాడు ఎవరుంటారని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ చేసిన ట్రోలింగ్‌లతో పద్మశాలీల గుండెలు పగిలిపోతున్నాయని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం పెట్టిన ఆ పోస్టింగ్‌పై కేటీఆర్, హరీశ్‌రావులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడున్నాడో చెప్పాలని మహేశ్‌గౌడ్ దుయ్యబట్టారు. సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ నేతలు సామా రామ్మోహన్‌రెడ్డి, సంధ్యారెడ్డి, భవానీరెడ్డి, బండారి శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment