వలస వచ్చిన నేతల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
రంగంలోకి పీసీసీ అధ్యక్షుడు, ఇన్‌చార్జి మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి
పీసీసీ కార్యవర్గం కుదింపు.. తగ్గనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ల సంఖ్య
జిల్లా పార్టీ అధ్యక్షులుగా కొందరు ఎమ్మెల్యేలు
4వ తేదీ నుంచి పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వలస నేతల రాకతో క్షేత్రస్థాయిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా రాష్ట్రంలోని 20–25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందనే నిర్ణయానికి వచ్చిన పీసీసీ ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్వయంగా ఇందుకోసం రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శిల సమక్షంలో ఆయా నియోజకవర్గాల్లోని పాత, కొత్త నాయకులు, కేడర్‌ను పిలిపించి మాట్లాడాలని, వారి అభ్యంతరాలు, సమస్యలను తెలుసుకుని రెండు బృందాలు కలిసి పనిచేసేలా సమన్వయం చేయాలనే నిర్ణయానికి పీసీసీ చీఫ్ వచ్చారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నేతలతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితాయాదవ్‌ల మధ్య సఖ్యత కుదిర్చారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
ఈ నియోజకవర్గమే కాకుండా ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు సంబంధించి పది అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన మరో పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలనొప్పులు రాకుండా ముందే పరిస్థితిని సెట్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ నిర్ణయించారు.
సమర్థుల కోసం అన్వేషణ
పీసీసీకి కొత్త చీఫ్ నియమితులైన నేపథ్యంలో పాత కార్యవర్గం రద్దు కానుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులను కొత్తగా నియమించనున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో జంబో కార్యవర్గం కాకుండా పదవుల సంఖ్యను తగ్గించే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గతంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా, ఇప్పుడు మూడుకు తగ్గించే అవకాశాలున్నాయి.
సీనియర్ ఉపాధ్యక్షుల నియామకంపై పునరాలోచన చేయాలని, ఉపాధ్యక్ష పదవులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సీనియర్ నాయకులకు అవకాశమివ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీపీసీసీ అధికార ప్రతినిధులను ఏరికోరి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగేలా మాట్లాడగలిగిన సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఈసారి అధికార ప్రతినిధుల జాబితాలో కూడా భారీ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పార్టీకి డీసీసీ అధ్యక్షులే కీలకమని చెప్పారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించనున్నారు. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు ఆయన ముందుగా వెళ్తారని, ఆ తర్వాత అన్ని జిల్లాల పార్టీ సమీక్షలు ముగించుకుని ఒక్కో జిల్లాకు వెళ్లి పార్టీ కేడర్‌కు మహేశ్‌గౌడ్ దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment