రణరంగంగా షర్మిల పాదయాత్ర | TRS Activists Attack On YS Sharmila At Warangal District Narsampet | Sakshi
Sakshi News home page

రణరంగంగా షర్మిల పాదయాత్ర

Published Tue, Nov 29 2022 12:47 AM | Last Updated on Tue, Nov 29 2022 12:51 AM

TRS Activists Attack On YS Sharmila At Warangal District Narsampet - Sakshi

సాక్షి, వరంగల్‌/ చెన్నారావుపేట:  రాష్ట్రంలో అధికార పార్టీ పనితీరును ప్రశ్నిస్తూ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో రణరంగంగా మారింది. నియోజకవర్గ సమస్యలను ఎత్తిచూపుతూ, స్థానిక ఎమ్మెల్యే పనితీరును తప్పుపడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు సోమవారం ఆందోళనలకు దిగాయి.

ఆమెకు స్వాగతం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీలను చింపేసిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. ఆమె బసచేసే ప్రత్యేక బస్సు (కారవాన్‌)పై పెట్రోల్‌ పోసి నిప్పంటించడం కలకలం రేపింది. తర్వాత షర్మిల సేదదీరుతున్న సమయంలో కర్రలు, పెట్రోల్‌ బాంబులు తేవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శాంతిభద్రతల సమస్య అంటూ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. 
పెట్రోల్‌  పోసి నిప్పు పెట్టడంతో దహనమవుతున్న బస్సు.. వైఎస్‌ షర్మిలకు తగిలిన గాయం 

యాత్ర మొదలైన కాసేపటికే.. 
నర్సంపేట మండలం రాములునాయక్‌ తండా సమీపంలో ఆదివారం రాత్రి వైఎస్‌ షర్మిల నైట్‌ హాల్ట్‌ చేశారు. సోమవారం ఉదయం 9.00 గంటల సమయంలో నర్సంపేట, మామునూరు, పరకాల ఏసీపీలు అక్కడికి వచ్చి మాట్లాడారు. ఇంటెలిజెన్స్‌ నివేదికల మేరకు పాదయాత్రలో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని చెప్పారు. దీనిపై స్పందించిన షర్మిల.. కావాలంటే టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడొచ్చని, కోర్టులో కేసు వేసుకోవచ్చని సమాధానమిచ్చారు.

తర్వాత 10.00 గంటలకు 223వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభమై.. రాజపల్లి, మగ్దుంపురం మీదుగా చెన్నారావుపేటకు చేరుకుంది. అక్కడ ఆమె ప్రసంగిస్తున్న సమయంలోనే కొంతదూరంలోని షర్మిల స్వాగత ఫ్లెక్సీలకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిప్పుపెట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత శంకరంతండా వద్ద వైఎస్‌ షర్మిల పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చి సేదతీరారు.మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కారులో అక్కడికి వచ్చిన కొందరు బస్సుపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టారు.

అది చూసిన గ్రామస్తులు, వైఎస్సార్‌టీపీ నాయకులు వెంటనే మంటలను ఆర్పేశారు. దీనిని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌టీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. ప్రతిగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు షర్మిల విశ్రాంతి తీసుకుంటున్న బస్సు వద్దకు దూసుకొచ్చి ‘షర్మిల గో బ్యాక్‌’నినాదాలు చేశారు. కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కర్రలు, పెట్రోల్‌ బాంబులు (పాలిథీన్‌ కవర్లలో పెట్రోల్‌ నింపినవి) పట్టుకువచ్చి దాడికి దిగారు. పలు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలకు, సీఐకి గాయాలయ్యాయి. 

వైఎస్‌ఆర్‌ విగ్రహం, షర్మిల ఫ్లెక్సీకి నిప్పుపెట్టిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు. 

అరెస్టు చేసి.. తరలించి..
శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందంటూ పోలీసులు వైఎస్‌ షర్మిలను అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని.. దీనికి పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ గూండాలను కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. అయితే పోలీసులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమెను అరెస్టుచేసి పోలీసు వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు విధ్వంసం ఆపలేదు.

ప్రత్యేక బస్సు అద్దాలను పగలగొట్టారు. మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఆ బస్సును చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ నేతలు లింగగిరిలోని వైఎస్‌ఆర్‌ విగ్రహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. వైఎస్‌ఆర్‌ అభిమానులు మంటలు ఆర్పి విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. 

దాడులపై ఫిర్యాదులు 
వైఎస్‌ షర్మిల పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల దాడి, ఫ్లెక్సీలు, బస్సు (కారవాన్‌), వైఎస్సార్‌ విగ్రహ దహనం ఘటనలపై వైఎస్సార్‌టీపీ నేతలు చెన్నారావుపేట పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను స్వీకరించామని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ సంపత్‌రావు తెలిపారు.  

తెలంగాణ చరిత్రలో ఇదో బ్లాక్‌ డే:  వైఎస్‌ షర్మిల
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ చరిత్రలో సోమవారం ఒక బ్లాక్‌ డే అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. తాను ప్రజలపక్షాన నిలబడినందుకు ప్రభుత్వం శిక్ష వేసిందని ఒక ప్రకటనలో మండిపడ్డారు. తన ప్రచార వాహనాన్ని తగలబెట్టడాన్ని, తనను అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. ప్రజా సమస్యల్ని ఎత్తిచూపుతున్న తన యాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణను తట్టుకోలేకే లేని శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, హైదరాబాద్‌కు తీసుకువచ్చారని ఆరోపించారు. ‘‘ఒకప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉద్యమకారులు పనిచేశారు.

ఇప్పుడు అందరూ గూండాలుగా మారారు. ఇలా దాడులు చేసే హక్కు ఎవరు ఇచ్చారు? పొద్దున్నుంచీ పోలీసులు లాఅండ్‌ ఆర్డర్‌ సమస్య అంటూ వచ్చారు. దుండగులు మా బస్సుకు నిప్పుపెట్టారు. వాహనాలన్నీ తగలబెట్టారు. వారిని అరెస్ట్‌ చేయలేదు, వాళ్లను ఆపాలన్న సోయి కూడా పోలీసులకు లేదు. ప్రజల గురించి కొట్లాడితే ప్రభుత్వం నాకు ఇలా బహుమతి ఇచ్చింది.  సిగ్గులేని సర్కారు.. సిగ్గులేని కేసీఆర్‌’’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనను ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించారని.. వారు యూనిఫాం వదిలి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుకోవాలని వ్యాఖ్యానించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement