బరిలోకి మరో ఇద్దరు భోజ్‌పురి సెన్సేషన్లు! బీజేపీ కసరత్తు | Two Bhojpuri Stars Fashion Designer Doctor BJP Asansol Options | Sakshi
Sakshi News home page

బరిలోకి మరో ఇద్దరు భోజ్‌పురి సెన్సేషన్లు! బీజేపీ కసరత్తు

Published Fri, Mar 8 2024 3:54 PM | Last Updated on Fri, Mar 8 2024 4:27 PM

Two Bhojpuri Stars Fashion Designer Doctor BJP Asansol Options - Sakshi

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ ప్రకటించిన అభ్యర్థి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆ స్థానంలో గట్టి అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రస్థాయి నేతలతోపాటు ఢిల్లీ స్థాయిలోనూ అభ్యర్థి ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

అసన్సోల్‌ లోక్‌సభ స్థానానికి ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను రాష్ట్ర యూనిట్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని పార్టీ వర్గాలు ఇద్దరు భోజ్‌పురి సంచలనాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వారిలో ఒకరు బెంగాలీ అయినప్పటికీ భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందారు.

బెంగాల్‌ బీజేపీ సూచించింది వీరినే..
బెంగాల్ బీజేపీ సూచించిన పేర్లు అగ్నిమిత్ర పాల్, జితేంద్ర తివారీ, డాక్టర్ అజయ్ పొద్దార్. వీరిలో అగ్నిమిత్ర పాల్ వైద్యురాలు, విద్యావేత్తల కుటుంబంలో జన్మించారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. శ్రీదేవి, మిథున్ చక్రవర్తి, కేకే మీనన్ వంటి బాలీవుడ్ తారలకు ఆమె కాస్టూమ్స్‌ రూపొందించారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అసన్సోల్‌ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇక మరో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ 2020లో బీజేపీలో చేరారు. హిందీలో అనర్గళంగా మాట్లాడగల ఆయన గణనీయమైన సంఖ్యలో హిందీ మాట్లాడే ఓటర్లను ప్రభావితం చేయగలడని పార్టీ భావిస్తోంది. ఆయన గతంలో అసన్సోల్ మేయర్‌గానూ పనిచేయడం మరింత కలిసొచ్చే అంశం. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కుల్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్‌ అజయ్‌ పొద్దర్‌ను కూడా స్థానిక పార్టీ పరిశీలిస్తోంది.

మరో ఇద్దరు భోజ్‌పురి సంచలనాలు
పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌ స్థానానికి ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం ఇద్దరు భోజ్‌పురి సంచలనాలను అన్వేషిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భోజ్‌పురి చిత్రాల బెంగాలీ స్టార్ 'మోనాలిసా'పై కాషాయ పార్టీ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఆమె అసలు పేరు అంటారా బిస్వాస్. హిందీ టెలివిజన్‌లో పేరు సంపాదించడంతో పాటు భోజ్‌పురి సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారారు. 

ఆమెకు బెంగాలీ, హిందీ, భోజ్‌పురి భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అందుకే ఆమెను అసన్‌సోల్ నుంచి పోటీ చేయించే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోనాలిసా బిగ్ బాస్-10లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.  దక్షిణ కోల్‌కతాలోని జూలియన్ డే స్కూల్‌లో చదువుకున్న ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. భోజ్‌పురి పరిశ్రమలో సెన్సేషన్‌ అయిన మోనాలిసా భోజ్‌పురి స్టార్‌నే వివాహం చేసుకున్నారు.

ఇక పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరైన మరో భోజ్‌పురి సంచలనం అక్షరా సింగ్‌ను రంగంలోకి దించే అవకాశాలను కూడా బీజేపీ పరిశీలిస్తోందన్న ఊహాగానాలు ఉన్నాయి.  'మోనాలిసా' కంటే పెద్ద స్టార్ అయినప్పటికీ అక్షరా సింగ్‌ విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.  ఈమెకు బెంగాలీ నేపథ్యం లేకపోవడం, పవన్ సింగ్‌తో గత అనుబంధం. బీజేపీ అధిష్టానం ఈ ఐదుగురిలో ఒకరిని ఎంపిక చేస్తుందా లేక ఇంకెవరైనా కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement