
సాక్షి, విజయవాడ: పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తున్నట్లుగా తొలుత చెప్పారు. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తానే అభ్యర్థినంటూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు స్కెచ్‌తో ఆయనకు షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించడంతో.. జనసేన ఆశలు గల్లంతయ్యాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరిని బరిలోకి దించింది బీజేపీ.
దీంతో ఎప్పటి నుంచి జనసేన తరపున విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన పోతుల మహేష్ పోరాటం వృథాగా మారింది. పవన్ హామీతో విజయవాడ వెస్ట్ టికెట్ తనకే వస్తుందని పోతిన మహేష్ బలంగా నమ్మారు. పదిరోజులుగా తన వర్గంతో ధర్నాలు,దీక్షలు చేశారు, అయినా నిరాశ తప్పలేదు. తాజాగా ఆ సీటు బీజేపీకి ఖరారు కావడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు పోతిన మహేష్,
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తమకే కేటాయించాలని జనసేన పట్టుబట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ నియోజక వర్గాన్ని బీజేపీకి కేటాయించడానికి సుముఖత చూపారు. మరోవైపు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై తర్జన భర్జనలు సాగాయి. వైశ్య సామాజిక వర్గం నుంచి వక్కల గడ్డ భాస్కరరావు, బీసీ నగరాలు సామాజికవర్గం నుంచి అట్లూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాం టికెట్ల రేసులో ఉన్నామంటూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఇంతలో చంద్రబాబు మరోసారి తన పాచిక వేశారు. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిపారు.