Viral Video: BSP Leader Seen Crying Profusely After Not Getting Party Ticket - Sakshi
Sakshi News home page

Viral Video: ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఏడ్చేసిన బీఎస్పీ నాయకుడు, చచ్చిపోతానని బెదిరింపు

Published Fri, Jan 14 2022 4:07 PM | Last Updated on Fri, Jan 14 2022 7:15 PM

Viral Video: BSP Leader Seen Crying Profusely After Not Getting Party Ticket - Sakshi

లక్నో: ప్రస్తుతం దేశమంతా అయిదు రాష్ట్రాల ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. ఈ అయిదింటిలో అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి చాలా ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. 403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

జనవరి 14 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.  మొత్తం 11 జిల్లాలు ఫస్ట్ ఫేజ్‌లో ఓటింగ్‌కు వెళ్లనున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో పార్టీ టిక్కెట్ల విషయంలోనూ రగడ మొదలైంది. ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుంచి టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) నాయకుడు అర్షద్ రాణా మీడియా ముందు ఏడుస్తూ కనిపించాడు. రెండేళ్ల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు టికెట్ కోసం రూ. 67 లక్షలు డిమాండ్ చేశాడని, అయితే తనకు తెలియకుండానే తన టికెట్ తొలగించారని అర్షద్ రాణా పోలీసుల ముందు ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు.
చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు

కాగా చార్తావాల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దధేడు గ్రామానికి చెందిన అర్షద్ రాణా చాలా కాలంగా బీఎస్పీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా జిల్లా పంచాయతీ సభ్యుని పదవికి బీఎస్పీ తరపున పోటీ చేశారు. పార్టీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న రాణా కొంత కాలంగా బీఎస్పీ నుంచి చార్తావాల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇంతలో బీఎస్పీ అధినేత్రి మాయావతి చార్తావాల్ అసెంబ్లీ స్థానం నుంచి సల్మాన్ సయీద్‌ను పార్టీ పోటీకి దింపినట్లు ట్వీట్‌ చేసింది. సల్మాన్ సయీద్ హోం శాఖ మాజీ రాష్ట్ర మంత్రి సయీదుజ్జమాన్ కుమారుడు. 
చదవండి: రెండే రెండు నిమిషాల్లో బాద్‌షా సాంగ్‌, స్పందించిన ర్యాపర్‌

అయితే యామవతి ప్రకటనతో కంగుతున్న రాణా తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. బీఎస్పీ నేత షంషుద్దీన్ రైన్ టికెట్ పేరుతో తమ నుంచి రూ.67 లక్షలు తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం తన మద్దతుదారులతో కలిసి కొత్వాలి నగరానికి చేరుకొని బీఎస్పీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశాడు. కాగా దీనిపై విచారణ జరుపుతున్నామని, విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిటీ కొత్వాలి ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ దేవ్ మిశ్రా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement