
సాక్షి, అమరావతి: ప్రస్తుతం బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతోందా లేదా అన్నది తమ అధిష్టానమే చెబుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పురందేశ్వరితో పాటు పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ సుజనాచౌదరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ , కోర్‌కమిటీ సభ్యులు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దయాకర్‌రెడ్డి, సీతారామాంజనేయచౌదరి, శివన్నారాయణ, కాశీవిశ్వనాథరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జనసేనతో పొత్తు అంశం, ఇటీవల పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ బీజేపీ పేరు కనీసం ఉచ్ఛరించకపోవడం తదితర అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. సమావేశ వివరాలను పురందేశ్వరి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేనతో ప్రస్తుతం బీజేపీ పొత్తు కొనసాగుతోందా.. లేదా.. అని ఓ విలేకరి ప్రశ్నించగా.. పురందేశ్వరి బదులిస్తూ ‘దానిపై నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిని మేం మా నాయకత్వానికి వివరించి చెబుతాం. వారు (పవన్‌కళ్యాణ్) ఏకారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారో వారే చెప్పారు.
అవన్నీ మేం మా నాయకత్వానికి చెబుతాం. దానిపై నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది..’ అని చెప్పారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలంటే వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంటాయిగానీ, తమది జాతీయ పార్టీ అని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలో ప్రతిదానికి ఒక ప్రొసీజరు ఉంటుందని, దాని ప్రకారమే వెళతామని చెప్పారు. బీజేపీతో కలిసి వెళితే ఓట్లు వస్తాయేమోగానీ, జనసేన నుంచి ఎంతమంది అసెంబ్లీకి వెళతామో గ్యారంటీ ఇవ్వలేమంటూ పవన్ తమ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన మాటలను విలేకరులు గుర్తుచేయగా.. ‘అది ఆయన కామెంట్. వారి ప్రతి కామెంట్ మీద నేను స్పందించాల్సిన అవసరం లేదు.
మా పార్టీ, మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుకూలంగానే వెళతాం..’ అని బదులిచ్చారు. జనసేన–టీడీపీ పొత్తు కచ్చితం, మాతో బీజేపీ కలిసివస్తుందో రాదో తేల్చుకోవాలని పవన్‌కళ్యాణ్ అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. ‘వారి (పవన్) వైపు నుంచి ఆయన చెప్పారు. మాకు కూడా పైనుంచి రావాలి కదా. మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అనుసరించి వెళతాం’ అని ఆమె పేర్కొన్నారు.
దసరాకు ముందే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
దసరా పండుగకు ముందే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని కోర్ కమిటీ సమావేశం నిర్ణయించినట్లు పురందేశ్వరి చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నాయకుడు సంతోష్ ఆ సమావేశానికి వస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment