
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఓబీసీ మహిళా రిజర్వేషన్ల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత శుక్రవారం అంబేడ్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు తెరమీదకు తీసుకొచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు.
జనగణన, నియోజక వర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్ల అమలును ముడిపెట్టడమే దీనికి నిదర్శనమన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు తేదీ లేని పోస్ట్‌డేటెడ్ చెక్కులా ఉండటంతో రిజర్వేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని మహిళా రిజర్వేషన్ల కోసం తాను ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన దూరదృష్టితో రూపకల్పన చేసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. మ్యూజియం సందర్శనకు వెళ్లిన కవితకు ఫెడరేషన్ ఆఫ్ అంబేడ్కర్ అండ్ బుద్దిస్ట్ అసోసియేషన్ యూకే సంయుక్తకార్యదర్శి శామ్కుమార్ స్వాగతం పలికారు.