
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. విగ్రహాలు, పార్లమెంట్ భవనం కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సినేషన్ కోసం రూ.30 వేల కోట్లు కేటాయించడం ఓ లెక్క కాదని దుయ్యబట్టారు. ఇటీవల బెంగాల్‌లో ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ కొన్ని వేల కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. తమ నాయకులు, మంత్రుల కోసం హోటళ్లు, విమానలు బుక్ చేశారని, వీటికి ఎంత ఖర్చు చేశారో తెలియదు గానీ దీనికి బదులు వ్యాక్సినేషన్ అందించి ఉంటే రాష్ట్రానికి ఉపయోగపడేదని అన్నారు.
కాగా రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, అవసరాలకు తగినంత ప్రాణవాయువు సరఫరా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం మమతా బెనర్జీ లేఖ రాసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును అంగీకరించడానికి బీజేపీ సిద్ధంగా లేదని మమతా బెనర్జీ అన్నారు. తనెప్పుడూ హింసకు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీజేపీ కావాలనే తప్పుడు వార్తలు, వీడియోలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బెంగాల్ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా.. ధీటుగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment