ఇది జంపింగ్ జపాంగ్‌ల టైమ్. ఆ పార్టీలో సీటు రాకపోతే.. ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో సీటు రాకపోతే ఆ పార్టీలోకి..ఇలా పార్టీలన్నీ కప్పల తక్కెళ్ళ మాదిరిగా తయారయ్యాయి. గులాబీ పార్టీ టిక్కెట్లు ప్రకటించేసింది. కాంగ్రెస్ సగం ఇచ్చింది. బీజేపీ ఇంకా ప్రకటించలేదు. దీంతో పక్క పార్టీల్లోకి వెళ్ళే నాయకులు బిజీగా తయారయ్యారు. ముఖ్య నేతల దగ్గర కొందరు జాయిన్ అవుతుంటే.. మరికొందరు ఎక్కడికక్కడ స్థానికంగా తమకు అవకాశం ఉన్న పార్టీలో చేరిపోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆపరేషన్ లోకల్ అంటూ ముందుకు సాగుతోంది? ఇంతకీ కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? , ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా మారిపోయింది. గెలుపు గుర్రాలైతే ఎక్కడి నుంచి వచ్చారన్నది చూడకుండా టిక్కెట్లు ఇచ్చేస్తోంది.
కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సగం సీట్ల అభ్యర్థుల్లో 11 మంది కొత్తవారు ఉన్నారని పార్టీలోని సీనియర్లు కొందరు రగిలిపోతున్నారు. తమకు సీట్లెందుకు ఇవ్వలేదని అగ్రనాయకత్వాన్ని ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని నిలదీస్తున్నారు. గాంధీభవన్‌లో కూడా ఆందోళనలు జరిగాయి. ఇక జనగాం టిక్కెట్ ఆశించి భంగపడిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రేవంత్‌రెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తన నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో ఆయన సమక్షంలోనే గులాబీ కండువా కప్పుకున్నారు.
ఇక నాగర్‌కర్నూల్ టిక్కెట్ ఆశించిన మరో సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి కూడా రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ కామెంట్స్ చేశారు. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో చూస్తా అంటూ నాగం ఛాలెంజ్ చేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మొత్తం రాష్ట్రమంతా ఆశావహులు పార్టీ నాయకత్వం మీద ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీద రగలిపోతున్నారు.
ఒకవైపు పార్టీలోని సీనియర్లు టిక్కెట్లు రాలేదని, ఇక రాబోదని నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తుంటే..మరోవైపు రేవంత్‌రెడ్డి జెట్ స్పీడ్‌లో ఇతర పార్టీల్లోని సీనియర్లను, టిక్కెట్లు రానివారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. కొందరితో మంతనాలు జరుపుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే స్థాయి నేతలను చేర్చుకుంది హస్తం పార్టీ. ఇక అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
బూత్ స్థాయిలో బలమైన క్యాడర్ కోసం ఆపరేషన్ లోకల్ పేరుతో అన్వేషణ మొదలు పెట్టింది హస్తం పార్టీ. ముఖ్యంగా అధికార పార్టీ నేతలే టార్గెట్ గా ఈ చేరికలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ ల నుంచి గ్రామ సర్పంచ్ ల వరకు పలు పార్టీల నేతలకు కాంగ్రెస్ కండువా కప్పుతూ చేరికల స్పీడ్ పెంచారు కాంగ్రెస్ నేతలు. బూత్ స్థాయిలో బలహీనంగా ఉన్న ప్రాంతాల వివరాలను ఇప్పటికే సునీల్ కనుగోలు టీం పీసీసీకి రిపోర్ట్ అందించింది. దీంతో పార్టీ బలహీనంగా ఉన్న బూత్ లలో ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తోంది టీ కాంగ్రెస్. ఇప్పటికే పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రోజూ పదుల సంఖ్యలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనూ చేరికలు జరుగుతున్నాయి.
బీఆర్ఎస్ జీహెఎంసీ కార్పోరేటర్లు జగదీశ్వర్ గౌడ్ తో పాటు ఆయన భార్య పూజిత , షాద్‌నగర్‌కు చెందిన సర్పంచులు ప్రతాప్, బాల్ రాజ్, గోపాల్, మంజుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ చెందిన ఎంపీపి హన్మంతురెడ్డితో పాటు వివిధ జిల్లాలకు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక నల్లగొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రమేష్ గౌడ్‌తో పాటు ఆరుగురు కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావు , శశిథర్ రెడ్డితో పాటు పలువురు సర్పంచ్ లు, జెడ్పీటీసీ లు కాంగ్రెస్ లో చేరారు. ఇదే ఫార్ములా ను రాష్ట్రం మొత్తం అమలు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మండవ వెంకటేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఆకుల లలిత వంటి సీనియర్లతోనూ మంతనాలు జరుగుతున్నాయి. స్థానిక నేతల బలం పెరిగితే ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్ ఈజీ అవుతుందని టీ కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసమే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లోకల్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment