
లోక్‌సభ స్పీకర్ పదవి చేపట్టేది ఎవరు..? బీజేపీకే ఆ హోదా దక్కుతుందా? ఎన్డీఏ పక్షాలు ఎగరేసుకుపోతాయా..? ఇండియా కూటమి డిమాండ్‌కు కేంద్రం తలొగ్గుతుందా.. లేదంటే చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహిస్తుందా..? కౌన్ బనేగా స్పీకర్..?
పార్లమెంట్ సమావేశాలు సమీపిస్తున్న వేళ.. లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఎన్డీఏ మిత్రపక్షాలతో సంప్రదింపులు ప్రారంభించింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రులు సమావేశం నిర్వహించారు. బీజేపీపాటు ఎన్డీఏ పక్షాలకు చెందిన సెంట్రల్ మినిస్టర్స్ ఈ భేటీలో పాల్గొన్నారు. స్పీకర్ ఎన్నికపై చర్చించారు.
సంకీర్ణ ప్రభుత్వంలో సభాపతి పదవి అత్యంత కీలకం. అందుకే స్పీకర్ పోస్ట్‌ను తన దగ్గరే అట్టేపెట్టుకోవాలని భావిస్తోంది బీజేపీ. డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలని యోచిస్తోంది. దీనిపై ఏకాభిప్రాయం కోసమే రాజ్‌నాథ్ నివాసంలో సమావేశం అయ్యారు కేంద్ర మంత్రులు. డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి ఇవ్వాలనే అంశంపైనా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ స్పీకర్ అభ్యర్థికి తాము మద్దతిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది జేడీయూ. కాబట్టి స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్న టీడీపీకే డిప్యూటీ స్పీకర్ దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది.
లోక్‌సభ స్పీకర్ బీజేపీ వద్దే ఉంటే, ఓం బిర్లాకే మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని సమాచారం. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఒడిశాలో బీజేడీ నుంచి బీజేపీలో చేరిన భర్తృహరి మహతాబ్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్ ప్రారంభం కానుంది. జూన్ 26న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు లోక్‌సభ ఎంపీలు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగలేదు. ఏకగ్రీవంగానే సభాపతిని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి విపక్ష కూటమి తమ అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తోంది. 233 మంది ఎంపీలున్న ఇండియా కూటమి.. డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వ్యూహాలు రచిస్తోంది. అదే జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా స్పీకర్ ఎన్నికకు శ్రీకారం చుట్టినట్టవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment