రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఐక్యతా పోరు ఉద్ధృతం చేశాయి. ఇందులో భాగంగా పట్నాలో తొలి విడత భేటీ నిర్వహించగా.. రెండో విడతలో భాగంగా బెంగళూరులో మరోసారి సమావేశమయ్యాయి. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, జేడీయూ సహా 26 పార్టీల అధినేతలు, అగ్ర నేతలు ఈ భేటీలో పాల్గొని పలు కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
విపక్ష కూటమికి ‘ఇండియా’(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇంక్యూజివ్ అలయన్స్)గా నామకరం చేస్తున్నట్లు సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఇండియా పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు సమాచారం. దీనిపై నేతలలంతా లోతుగా చర్చించి, ఏకాభిప్రాయంతో అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇండియా పేరు ఎలా పెడ్తారు?
అయితే ఇండియా అనే పేరును బిహార్ సీఎం నితీష్ కుమార్ గట్టిగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. విపక్షాల కూటమి పేరు గురించి కాంగ్రెస్ ఏ విధంగానూ చర్చించలేదని, దీంతో నితీష్ షాక్‌కు గురైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో NDA అక్షరాలు ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కూటమికి ఇండియా అనే పేరు ఎలా పెడ్తారని భేటీలోనే జేడీయూ అధినేత ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
నితీష్‌పాటు వామపక్షాలు సైతం
నితీష్‌తోపాటు వామపక్ష నేతలు కూడా INDIA పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయ పేరును సూచించినట్లు సమాచారం. కానీ మిగతా మెజార్టీ పార్టీలు ఆమోదించడంతో నితీష్ కుమార్ సైతం చివరికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘సరే మీ ఆందరికీ ఇండియా పేరు ఓకే అయితే కానివ్వండి.. అదే మంచిందంటూ బిహార్ సీఎం అన్నట్లు సమాచారం. కాగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో నితీష్ కుమార్ పాత్ర ఎంతో కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చదవండి: డేంజర్ యమున.. తాజ్ మహల్‌ను తాకిన వరద
జీతేగా భారత్
తమ కూటమికి ఇండియా అనిపేరు పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు దానికి ట్యాగ్‌లైన్‌గా ‘జీతేగా భారత్’( భారతదేశం గెలుస్తుంది)ఎంచుకున్నాయి. కూటమి ట్యాగ్‌లైన్ హిందీలో ఉండాలని ఉద్దవ్ ఠాక్రే సూచించారని తెలుస్తోంది. హిందీ భాషతోపాటు అన్ని భాషల్లో ఈ ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తామని వెల్లడించాయి.
కూటమికి సారథి ఎవరు?
ప్రతిపక్షాల కూటమికి సారథి ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు. అయితే నాయకత్వ బాధ్యతలను సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించవచ్చునని తెలుస్తోంది. భాగస్వామ్యుల మధ్య సమన్వయం, సహకారం తదితరాల సాధనకు 11 మంది సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాయి.
ముంబైలో నెక్స్ట్ మీటింగ్
విపక్షాల తర్వాతి భేటీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరగనుంది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అశం, సీట్ల సర్ధుబాటుపైనా ఆరోజే చర్చిస్తామని నేతలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment