2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శల దాడులను చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని పక్కనపెట్టి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సీఎం యోగిని టార్గెట్ చేశారు. జూన్ 4 తర్వాత బీజేపీ సీనియర్ నేతలందరి పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.. ‘వాళ్లంతా పారిపోతారు. రాహుల్ గాంధీ గానీ, భారత కూటమిలోని సభ్యులు గానీ ఎన్నడూ పారిపోరు. దేశానికి అండగా నిలుస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం చేశారు. దేశం కోసం ఏ బీజేపీ నేత అయినా బలిదానం చేశారా? వీళ్లంతా వ్యాపారస్తులు, భయపడతారు. ఆ వ్యాపార వలయంలో చిక్కుకుపోయానని యోగి గ్రహించాలి’ అని నానా పటోలే అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ కూడా మీడియా సమావేశంలో సీఎం యోగిపై పలు వ్యాఖ్యానాలు చేశారు. యోగి ఢిల్లీకి వచ్చి తనపై దుర్భాషలాడారని ఆరోపించారు. అయితే ఆయనకు అసలు శత్రువులు బీజేపీలోనే ఉన్నారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎం యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేశారు. యూపీలో పరిస్థితి గందరగోళంగా ఉన్నందున సీఎం యోగి అక్కడే ఉండాలని అన్నారు. యూపీలో పరిస్థితి కనిపించిన దానికి భిన్నంగా ఉందన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో పదేళ్లుగా అధికారంలో ఉంటూ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే మరోమారు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాపంగానూ ఆయన స్థాయి పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం యోగి పేరు ఉంది. ఆయన ఎన్నికల ప్రచారానికి అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment