
తెలంగాణ కాంగ్రెస్‌లో కర్నాటక ఫార్ములా అమలు చేయబోతున్నారా? కర్నాటక ఫార్ములాకే కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందా? తెలంగాణలో కర్నాటక ఫార్ములా కరెక్ట్గా అమలవుతుందా? ఆ ఫార్ములాపై టీ కాంగ్రెస్ నేతలకు అనుమానం ఎందుకు వస్తోంది? అసలు కర్నాటక ఫార్ములా ఏంటి?
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆశిస్తోంది. అక్కడ అభ్యర్థులకు టిక్కెట్స్ ఇవ్వడానికి అనుసరించిన విధానం బాగుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇకముందు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కర్నాటక ఫార్ములానే అమలుచేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంవత్సరం ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో కూడా కర్నాటక ఫార్ములా అమలవుతుందని ఇక్కడి నేతలకు కూడా సమాచారం అందినట్లు చెబుతున్నారు. కర్నాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా పీఠం దక్కుతుందని కాంగ్రెస్ నాయకత్వం ఎంతో ఆశతో కనిపిస్తోంది.
అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కర్నాటక పీసీసీ స్సష్టమైన నిబంధనలు అమలు చేసి ముందుకు సాగుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే నిర్వహించారు. ఎవరికైతే ప్రజాదరణ ఉందని తేలిందో వారికే టిక్కెట్లు ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ ఇవ్వలేదని చెబుతున్నారు. అదేవిధంగా టిక్కెట్ రానివారిని బుజ్జగించడం ద్వారా అసమ్మతికి చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. టిక్కెట్ల ఎంపికలో నిక్కచ్చిగా వ్యవహరించడం, కాంగ్రెస్ మేనిఫెస్టో, బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో కాంగ్రెస్కు స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయని ఏఐసీసీ అంచనా వేస్తోంది.
కర్ణాటక ఫార్ములాను తెలంగాణాలో కూడా అమలు చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించడంపై గాంధీభవన్లో చర్చకు తెర తీసింది. సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు పలు సర్వే సంస్థలు రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించాయి. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు, నేతల పనితీరు, క్యాడర్ పట్టున్న సెగ్మెంట్లపై సర్వేలు చేశారు. అప్పటికే నియోజకవర్గాల్లో పనిచేస్తున్న లీడర్ల గెలుపు అవకాశాలపై కూడా సర్వేలు జరిగాయని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటికే టిక్కెట్లు ఆశిస్తున్నవారు తమకున్న పరిచయాలు, పలుకుబడితో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా టిక్కెట్ సాధించాలనే పట్టుదలతో పైరవీలు చేస్తున్నారు. అయితే సర్వేలో ప్రజాదరణ ఉందని తేలినవారికే టిక్కెట్లు ఇస్తారనే ప్రచారంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు కంగారు పడుతున్నారు. సర్వేలు నిజాయితీగా చేసి కచ్చితంగా గెలిచేవారికి టిక్కెట్లు ఇస్తే పార్టీకే మేలు జరుగుతంది. కాని పీసీసీ స్థాయిలో ఉన్న నాయకలు తమకు కావలసినవారికి అనుకూలంగా, పడనివారికి వ్యతిరేకంగా సర్వే నివేదికలు తెప్పించుకుని టిక్కెట్ల కేటాయింపులో గోల్మాల్ చేస్తారనే భయం నాయకుల్లో కనిపిస్తోంది. అసలే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైనా జరగొచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి కేపీసీసీ టిక్కెట్ల విధానాన్ని ఫాలో కావాలనుకుంటున్న టీపీసీసీ పని సజావుగా సాగుతుందా? సర్వేలు నిజాయితీగా చేస్తారా? లేక కొందరు నాయకులు అనుమానిస్తున్నట్లు గోల్‌మాల్ చేస్తారా అనేది తేలడానికి కొంత సమయం పడుతుంది. ఏదేమైనా కర్నాటకలో ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.