సభలో తాళిబొట్లు చూపిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: హిందూ మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా.. సిగ్గులేదా అంటూ శుక్రవారం శాసన మండలిలో పలువురు మహిళా ఎమ్మెల్సీలు టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. ఉదయం సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంలోకి వచ్చి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో అందులో కొందరు మంగళసూత్రాలను చూపుతూ కేకలు వేశారు. దీంతో ఎమ్మెల్సీ టి.కల్పలతతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన పోతుల సునీత, వరుదు కళ్యాణిలు పోడియంలోకి వచ్చి ‘తాళిబొట్లను సభలోకి తీసుకొచ్చి మహిళలను కించపరుస్తారా’ అంటూ టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు.
చైర్మన్ వెంటనే ఆ మంగళసూత్రాలను స్వాధీనం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ మోషేన్‌రాజు స్పందిస్తూ.. తాళి బొట్టు అనేది హిందూ మహిళలు పవిత్రంగా భావిస్తారని, వాటిని సభలోకి తీసుకొచ్చి మహిళలందరినీ అవహేళన చేస్తున్నారని.. వెంటనే సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. అయినా టీడీపీ సభ్యులు అలాగే వ్యవహరిస్తుండడంతో మహిళా ఎమ్మెల్సీలతో వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ సభ్యుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సమయంలో చైర్మన్ సభను ఐదు నిమిషాలపాటు వాయిదా వేశారు.
శాసనసభలోనూ..
టీడీపీ సభ్యులు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలోనూ తాళిబొట్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. సారా మరణాలపై న్యాయవిచారణ నిర్వహించాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు స్పీకర్ పోడియంపై చేతులతో చరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాళి బొట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆ తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు.
8 మంది సస్పెన్షన్
వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమయ్యాక కూడా టీడీపీ సభ్యులు పోడియంలోకి మళ్లీ వచ్చి మంగళసూత్రాలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 8 మందిని సభ నుంచి సస్పెండ్ చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రతిపాదించగా.. ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, కేఈ ప్రభాకర్, రాజసింహులు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, మంతెన వెంకట సత్యనారాయణరాజులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తరలించారు. మిగిలిన ఎమ్మెల్సీలతో కలిసి లోకేశ్ కూడా బయటకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment