
అమరావతి, సాక్షి: టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయం హత్యలు, దాడులతోనే ఆగిపోవడం లేదు. అక్రమ కేసులు పెట్టైనా సరే వైఎస్సార్‌సీపీ నేతల్ని కటకటాలపాలు జేయాలని ప్రయత్నిస్తోంది. తాజాగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు దుష్ట రాజకీయానికి ఎల్లో మీడియా తోడైంది.
వల్లభనేని వంశీ షయంలో టీడీపీ అనుకూల మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ పేరును పోలీసులు ఏ-71 నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేశారు. అయితే.. ఎల్లో మీడియా ఛానెల్స్, వెబ్‌సైట్స్ మాత్రం రెండ్రోజులుగా మరోలా హడావిడి చేస్తున్నాయి. ఒకానొక దశలో వంశీపై తప్పుడు ప్రచారానికి సైతం దిగాయి.
ఇంతకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రమంతా చూసింది. ఈవీఎం కేసులో ఆయనకు న్యాయస్థానం ఊరట ఇచ్చినప్పటికీ.. అక్రమ కేసులు బనాయించి మరీ ఆయన్ని జైలుకు పంపేదాకా వదల్లేదు. అయితే.. ఆ టైంలోనూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అత్యుత్సాహం ప్రదర్శించాయి.
ఇదీ చదవండి: ఇంతకీ మంత్రి లోకేష్ ఎక్కడ?
ఇక ఇప్పుడు వంశీ.. హైదరాబాద్‌లో ఉన్నారని ఓసారి, అమెరికా వెళ్లిపోయారని మరోసారి, ఏకంగా అరెస్ట్ అయ్యారంటూ ఇంకోసారి.. కథనాలు ఇచ్చేశాయి. అయితే పోలీసులు మాత్రం ఆ వార్తలన్నింటినీ ఖండించారు. దీంతో ప్రత్యేక బృందాలతో ఆయన కోసం గాలింపు కొనసాగుతోందంటూ మళ్లీ కథనాలు మొదలుపెట్టాయి. అంతేకాదు.. ఏ 71గా ఉన్న ఆయన్ని ఈ కేసులో ఏ1గా మార్చేయబోతున్నారంటూ పోలీసుల తరఫున నిర్ణయాల్ని కూడా భవిష్యవాణి తరహాలో ప్రచురిస్తున్నాయి. ఇది ఇక్కడితోనే ఆగిలేదు. వంశీ కుటుంబ సభ్యులు, అనుచరులను సైతం ఇందులోకి లాగుతూ అడ్డగోలు రాతలు రాస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment