బడి లేదు.. భవిష్యత్తూ లేదు.. కూటమి ప్రభుత్వంపై జూపూడి ఫైర్‌ | YSRCP Jupudi Prabhakar Rao Fires On Nara Lokesh Over AP Education System | Sakshi
Sakshi News home page

బడి లేదు.. భవిష్యత్తూ లేదు.. కూటమి ప్రభుత్వంపై జూపూడి ఫైర్‌

Published Mon, Nov 25 2024 6:49 PM | Last Updated on Mon, Nov 25 2024 7:07 PM

YSRCP Jupudi Prabhakar Rao Fires On Nara Lokesh Over AP Education System

సాక్షి, తాడేపల్లి : బడి లేదు.. భవిష్యత్తూ లేదు. ఆరు నెలల కూటమి పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు.  కూటమి ప్రభుత్వ వైఫల్య పాలనపై వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాయలంలో జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్‌ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కేసింది. 2004కి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పాదయాత్రలో చూసిన పరిస్థితులతో చలించిపోయి మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్‌ పథకానికి శ్రీకారం చుట్టారు.

మరోవైపు ఫీజులు చెల్లించలేక పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా విద్యా విప్లవం తీసుకొచ్చారు. ఆ పథకం ఎందరో విద్యార్థుల జీవితం మార్చింది. ఎందరో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.   2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్లీ 2004కి ముందు పరిస్థితులను తీసుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో..:
2019లో జగన్  సీఎం అయ్యాక, రాష్ట్రంలో మళ్లీ విద్యావిప్లవం మొదలైంది. ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మార్చేశారు. వాటిలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టి కొత్త ఒరవడికి నాంది పలికారు. మంచి పౌష్టికాహారం, రోజుకో మెనూతో మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దను అమలు చేశారు. అంగన్‌వాడీల్లో సంపూర్ణ పోషణ అమలు చేశారు. పిల్లలకు పూర్తి ఫీజు చెల్లిస్తూ విద్యాదీవెన అమలు చేశారు. బిడ్డ  చదువుల కోసం తల్లి ఫీజులు కట్టే విధంగా మహిళా సాధికారతకు అర్థం తెచ్చేలా, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆ మొత్తం నేరుగా జమ చేశారు.

మళ్లీ అంతా అస్తవ్యస్తం:
కూటమి ప్రభుత్వం రాగానే విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసేశారు. గోరుముద్ద పథకాన్ని మూలన పడేశారు. ఇంగ్లిష్‌ మీడియం ఆగిపోయింది. అమ్మ ఒడి లేదు. విద్యావ్యవస్థను పూర్తిగా తొక్కేశారు. ఆరు నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది.

ఉదా: ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఫీజు కట్టలేదని ఓ విద్యార్థిని కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపేసింది.
పిల్లలు ఫీజు బకాయిలు కట్టలేదంటూ చాలాచోట్ల వారికి టీసీ ఇవ్వడం లేదు. ఇంకా చాలా మంది పిల్లలు ఫీజులు కట్టలేక, విద్యార్థులు కూలీ పనులకు పోతున్నారు.

జగన్‌పై కక్ష పిల్లలపై చూపొద్దు:
జగన్‌ మార్క్‌ విధానాలు ఎక్కడా కనిపించకూడదనే అక్కసుతోనే కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పథకం ప్రకారం కాలరాస్తోంది. తల్లిదండ్రుల ఆశలు చిదిమేస్తోంది. మీకేదైనా కక్ష ఉంటే మా మీద తీర్చుకోండి. అమాయక, పేద ప్రజల భవిష్యత్తును నాశనం చేయొద్దు. విద్యను నమ్ముకుని జీవితాలను బాగు చేసుకోవాలని కలలు కంటున్న వారి నమ్మకాన్ని కాలరాయొద్దు. 

నిజానికి 2019లో చంద్రబాబు దిగిపోతూ పెట్టిన రూ.2,800 కోట్ల ఫీజు బకాయిలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది.  ఆరు నెలల కూటమి పాలనలో విద్య, వైద్య రంగాలు మూలన పడ్డాయి. పేకాట క్లబ్‌లు, మద్యం షాపులు విచ్చలవిడిగా వెలిశాయి.

జగన్ పై కోపంతో పేద విద్యార్థుల జీవితాలు నాశనం... లోకేష్ పై జూపూడి ఫైర్
  • 2019–24. విద్యారంగం వ్యయం:

  • అయిదేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యయం రూ.12,609 కోట్లు.

  • మనబడి నాడు–నేడు మొదటి దశలో రూ. 3,669 కోట్లతో 15,715 బడుల్లో సమూల మార్పులు. రెండో విడతలో రూ.8వేల కోట్ల వ్యయంతో   22,344 స్కూళ్ల సమగ్ర అభివృద్ధి.

  • అమ్మ ఒడి పథకంలో 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ.

  • విద్యాదీవెనలో 29,65,930 మంది మంది పిల్లలకు మేలు చేస్తూ, రూ.12,609 కోట్ల ఫీజు చెల్లింపు.

  • వసతి దీవెన కింద 25,17,245 మందికి రూ.4,275 కోట్లు.

  • జగనన్న విదేశీ విద్యాదీవెనలో దాదాపు 408 మందికి రూ.107 కోట్లు

  • విద్యాకానుక కిట్‌లు. 47,40,421 మంది పిల్లలకు లబ్ధి. వ్యయం రూ.3,366 కోట్లు.

  • 8వ తరగతి పిల్లలకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు.

  • గోరుమద్దు పథకంలో 43,26782 మంది పిల్లలకు మేలు చేస్తూ రూ.6,568 కోట్లు ఖర్చు.

  • అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలకు, చిన్నారుల పౌష్టికాహారం కోసం సంపూర్ణ పోషణ కింద రూ.9,894 కోట్లు ఖర్చు.

  • శానిటరీ న్యాప్‌కిన్స్‌ కోసం రూ.32 కోట్లు.

  • 6వ తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ.

  • 2024–25లో టీచర్ల టీచింగ్‌ సామర్థ్యం పెంచేందుకు ట్రైనింగ్‌ ఇచ్చారు.  

  • ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పిల్లలకు ఐబీలో విద్యాబోధన మొదలు. అలా 2035 నాటికి పదో తరగతి పిల్లలకు సర్టిఫికెట్‌.

అలా గత ఐదేళ్లలో కేవలం విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం రూ.73 వేల కోట్లు. జగన్  ఒక్కరే అంత ఖర్చు చేస్తే, మీ మూడు పార్టీలు కలిసి చేసే ఖర్చెంతో చూపించాలని జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్‌ చేశారు.

ఫీజు బకాయిలు చెల్లించాలి: రవిచంద్ర, వైస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా  విద్యాదీవెన, వసతి దీవెనకి ఒక్క రూపాయి కేటాయించలేదు. పైగా మంత్రి నారా లోకేశ్‌ గత ప్రభుత్వం రూ.6500 కోట్లు బకాయిలు పెట్టిపోయిందని మాట్లాడుతున్నారు. నిజానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి రూ.502 కోట్లు మాత్రమే. ఎన్నికల కోడ్‌ వల్ల ఆ చెల్లింపు కోసం అనుమతి తీసుకున్నా, ఇవ్వకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. 

ఫలితంగా చివరి క్వార్టర్‌ ఫీజు చెల్లింపు ఆగిపోయింది.  కాలేజీల యాజమాన్యాలు లోకేశ్‌ని కలిసి రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు గురించి అడిగినా వారిని పట్టించుకోలేదు. ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ విద్యార్థుల నుంచి ఆయా విద్యాసంస్థలు అండర్‌టేకింగ్‌ లెటర్లు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో, అవి విద్యార్థులే చెల్లించేలా వారితో ఒప్పందాలు చేసుకుంటున్న దుస్థితి.
విద్యా రంగంలో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారో కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. కానీ అదే చంద్రబాబు పెట్టిన బకాయిలను వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండగా చెల్లించి పెద్ద మనసు చాటుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement