రెండున్నర నెలల పాలనలోనే రాష్ట్రం అగ్నిగుండం
హత్యలు, హత్యాయత్నాలు, దౌర్జన్యాలు, అల్లర్లు
ఢిల్లీ వేదికగా అన్నీ బట్టబయలు చేసిన వైయస్సార్‌సీపీ
దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్
అందుకే ఫైళ్ల దహనం పేరుతో రోజుకో ప్రహసనం
చంద్రబాబూ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు
నిజంగా అక్రమాలు జరిగితే బయటపెట్టండి
మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజం
తాడేపల్లి: ఫైళ్ల దహనం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. కూటమి రెండున్నర నెలల పాలనలోనే రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని.. హత్యలు, హత్యాయత్నాలు, దౌర్జన్యాలు, అల్లర్లు సర్వసాధారణం అయ్యాయని, వాటన్నింటినీ తమ పార్టీ ఢిల్లీ వేదికగా బట్టబయలు చేసిందని ఆయన వెల్లడించారు. దీంతో దిక్కు తోచని స్థితిలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఫైళ్ల దహనం పేరుతో రోజుకో ప్రహసనం చేస్తోందని ఆక్షేపించారు. వారిప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, నిజంగా అక్రమాలు జరిగి ఉంటే బయట పెట్టాలని మాజీ ఎంపీ సవాల్ చేశారు.
మంత్రి నారా లోకేష్ ప్రకటించినట్లు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, మరోవైపు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా, ఇటీవల సీఎం చంద్రబాబు.. ఫైల్స్ దహనం నిందలు మొదలు పెట్టారని చెప్పారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. అలాగే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే, దాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆపాదించేందుకు ఎన్నో కుట్రలు చేశారని మార్గాని భరత్ చెప్పారు.
ఆ ఘటన జరిగిన వెంటనే డీజీపీని, సీఐడీ చీఫ్‌ను హుటాహుటిన హెలికాప్టర్‌లో మదనపల్లెకి పంపి, ఆ ప్రమాదంపై ఏకంగా 10 దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయడమే కాకుండా, పలు జిల్లాల నుంచి డాక్ స్క్వాడ్‌లు, ఫోరెన్సిక్ బృందాలను రప్పించారని గుర్తు చేశారు. ఆ అగ్ని ప్రమాదం నిజంగా కుట్ర అయితే, ఇప్పటి వరకు సీఎం ఆ వివరాలు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు తప్పిదాలను అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా తేల్చిన నేపథ్యంలో, దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్తగా ధవళేశ్వరంలోని ఆఫీస్‌లో ఫైల్స్ దగ్ధం చేశారంటూ నానా హంగామా చేసి, నలుగురు అధికారులను సస్పెండ్ చేశారని ఆక్షేపించారు.
విజయవాడ–అవనిగడ్డ కరకట్ట మీద ఏపీపీసీబీ, ఎండీసీ ముఖ్య ఫైళ్లను దగ్ధం చేశారని నిందిస్తూ, తమపై విపరీతంగా దుష్ప్రచారం చేశారని గుర్తు చేసిన, మార్గాని భరత్, ఆ ఘటనకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏం చెప్పారన్నది చూపారు. ఎన్నికల మందు విచ్చలవిడిగా ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలో తెలియక, సీఎం చంద్రబాబు మొదలు మంత్రులంతా ఒకే పాట పాడుతున్నారని.. రాష్ట ఖజానా ఖాళీ అని, రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని అంటూ, గత మా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మాజీ ఎంపీ ఆక్షేపించారు. నిజానికి 2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కంటే గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే రాష్ట్ర అప్పులు తక్కువని చెప్పారు.
ఎప్పుడూ ప్రచార ఆర్భాటాన్ని కొనసాగించే చంద్రబాబు, ఈరోజు (సోమవారం) కూడా శ్రీసిటీలో అదే డ్రామా చేస్తున్నారని మాజీ ఎంపీ దుయ్యబట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గుర్తించాలని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా చేస్తున్న అసత్య ప్రచారాలు, హంగామా, ఆర్భాటాలను నమ్మొద్దని మార్గాని భరత్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment