విద్యాశాఖ మంత్రి లోకేశ్ సవాల్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం
మెగా డీఎస్సీ 2025 స్కామ్ ఆధారాలతో సహా బయటపెట్టి చాలా రోజులైంది
మాజీ సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారు.. ప్రతి పాయింటుకూ పక్కా ఆధారాలు చూపారు
ఇవ్వాళ్టికీ చంద్రబాబు, లోకేశ్ దీనిపై సమాధానం చెప్పేందుకు ముందుకు రావడం లేదు.. సీబీఐ విచారణ
కోరితే నోరు మెదపడం లేదు
ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య చర్చ కోరితే ఒక అర్థం ఉంటుంది
అసలు గోల్డ్‌మెడల్ విజేత దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేశ్?.. డీఎస్సీ స్కాంపై లోకేశ్‌తో చర్చకు నేను రెడీ..
టైము, తేదీ, ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా ఓకే
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చకు తాను సిద్ధమని.. సమయం, తేదీ, వేదిక లోకేష్ చెప్పినా సరే.. లేదా తనను చెప్పమన్నా రెడీ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని.. ఈలోగా డీఎస్సీ స్కామ్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజల ఎదుట ఉంచిన అంశాలను మరోసారి గుర్తు చేస్తున్నామని.. ముందు వాటికి జవాబు చెప్పాలని సూచించారు. ‘లోకేశ్..! సరుకు లేక సవాళ్లు విసరడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ విన్నావా అసలు? నువ్వుగానీ, మీ నాన్న గానీ వాటికి సమాధానం చెప్పాలని అడిగారు.
వినలేదా? లేక విని కూడా వినపడనట్లు నటిస్తున్నారా? అని ఈ రాష్ట్రంలో యువత అడుగుతోంది.. తల్లిదండ్రులు అడుగుతున్నారు.. ప్రజలు అడుగుతున్నారు.. జగన్ ప్రశ్నలకు జవాబు చెబుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ప్రతి నిరుద్యోగి నీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ సూటిగా, స్పెసిఫిక్‌గా ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా జవాబు చెప్పే ధైర్యం లేక 200 మీటర్ల దూరంలో నీ ఇల్లు ఉంది అని సవాల్ విసురుతావా? మీ నాన్న సవాల్ విసిరితే ఏదైనా అర్ధం ఉంటుంది.
మెగా డీఎస్సీ స్కామ్‌పై అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీన్ని బట్టి తప్పు జరిగిందని అర్థమవుతోంది. అది నీకు కూడా తెలుసు. దాన్ని డైవర్ట్ చేయటానికే సవాల్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. అయినా నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి.. ఆ దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులతోనే కలసి వస్తా. వాటికి సమాధానం చెప్పు.. మనిద్దరం మంత్రులుగా చేశాం కాబట్టి సమ ఉజ్జీలం.. నీ స్థాయికి నేను చాలు.. అయినా నీకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. అందుకే ఆ ప్రశ్నలన్నీ మళ్లీ నిన్ను అడుగుతున్నా. నీకు గుర్తుండేలా ఈసారి అన్ని పత్రికల్లో ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టి ప్రచురించమని కోరుతున్నా.
పార్టిసిపెంట్‌కు ఉద్యోగం ఇచ్చేసి.. గోల్డ్‌మెడల్ సాధించిన వారికి పోస్టు ఎందుకు ఇవ్వరని గోల్డ్‌మెడల్ విజేత, డీఎస్సీ అభ్యర్థి దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేశ్? ముందు దుర్గయ్య ప్రశ్నకు జవాబు చెప్పు. తరువాత నేను వస్తా.. ’అని పేర్ని నాని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్కామ్‌పై చర్చ విషయంలో లోకేష్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కామ్‌ను బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని, స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టామని, ప్రతి అంశాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని గుర్తు చేశారు.
సీబీఐ విచారణ కోరే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, అవినీతిమయమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.
ఈ ప్రశ్నలకు జవాబేది లోకేశ్..?
1. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్‌లోడ్ ప్రక్రియలను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అప్పగించారు? ఎస్‌సీఈఆర్‌టీలో పనిచేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డీఎస్సీలో మొదటి ర్యాంకు, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్‌లో ఆరో ర్యాంకు రాలేదా? మరి మొదటి ర్యాంకు వచ్చిన నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? లాగిన్ ఐడీ ఎందుకు బ్లాక్ చేశారు? డేటా ఎందుకు తొలగించారు? అతడి వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు? అంటే పేపర్ లీకేజీ జరిగిందని మీరు ఒప్పుకున్నట్లే కదా? వెరిఫికేషన్‌కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని ఎలా సమర్థించుకుంటారు? అదే నిజమైతే అతడు ఎందుకు హైకోర్టుకు వెళ్లాడు?
2. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. 2012లో జారీ చేసిన జీఓ నెం.74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాలి. కానీ జీవో నెం:4, జీఓ నెం:47 ద్వారా ఆ నిబంధనను ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబు ఏమిటి? అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే మళ్లీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ జీవో నెం:23, జీఓ నెం:25, జీఓ నెం:56 ఎందుకు ఇచ్చారు? అంటే మీ వాళ్లకోసం గేట్లు ఎత్తారు. మీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం పూర్తికాగానే మళ్లీ గేట్లు మూసేశారు. ఇది స్కామ్ కాదా?
3. సాఫ్ట్ బాల్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్‌కు మీ ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చిందీ ఆ అసోసియేషన్లే.. అలాగే ధృవీకరించిందీ వాళ్లే కదా? అవునా? కాదా?
4. క్రీడాకారులకే ఇవ్వాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కాకుండా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?
5. మెరిట్, ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు, ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి? అనే విషయాలన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి అన్నీ పరిశీలించాకే రూల్ నంబర్ 20 ప్రకారం వెరిఫికేషన్‌కు 1 : 1 పద్ధతిలో పిలిచారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్ మెన్, జోన్.. ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. కానీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తరువాత, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలాక కూడా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఎవరి కోసం ఆ సర్దుబాటు? ఇది దగా.. మోసం.. స్కామ్ కాదా?
6. టీచర్ల పోస్టులు రూ.15 – 20 లక్షలకు అమ్ముకుంటూ బేరసారాలు జరిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. దానికి సమాధానం ఏది? పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొన్నారు? ఫోన్ నంబర్ తెలిసినా, సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు?
7. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత ఎస్‌సీఈఆర్‌టీకి, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌కు అప్పగించేవారు. గోప్యత, పారదర్శకత కోసం వేర్వేరు వ్యక్తులకు అప్పగించేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కే అప్పగించారు. దీనిపై సమాధానం ఏది?
8. డీఎస్సీల చరిత్ర చూస్తే.. కలెక్టరేట్ వద్ద నోటీస్ బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆ పద్ధతిని రద్దు చేసి కేవలం ఆన్‌లైన్ ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు? అందులో కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేశారు?
9. పీఈటీ ఉపాధ్యాయులకు డీఎస్సీ పరీక్షతోపాటు సంబంధిత డిగ్రీ నుంచి కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్లపాటు వెసులుబాటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
10. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను, జీవితాలను ప్రభుత్వం అత్యంత దారుణంగా, అమానుషంగా తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవహార మే కదా? మరి దీనికి బాధ్యత ఎవరిది? రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో నిజాలు బయటకు వస్తాయా? ఆ నిజాలన్నీ వెలికి తీయాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం లేదా?

డీఎస్సీ 2025లో టీజీటీ (తెలుగు) జోన్–2లో తనకు 6వ ర్యాంకు వచ్చినట్లు హైకోర్టుకు తెలిపిన నవీన్


