
రాజమహేంద్రవరం రూరల్: ఏ రాష్ట్రంపైనా లేని విధంగా ఏపీపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు తదితర అంశాలపై లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు ప్రస్తావించారని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం కావాలనే సాకులు చెబుతున్నట్లు ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటున్న కేంద్రం.. దానికి గల కారణాలను పరిశీలించడం లేదని మండిపడ్డారు. గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 14వ ఆర్థిక సంఘం నిధుల మంజూరు, వాటి దుర్వినియోగంపై నాటి టీడీపీ పాలకులను ప్రశ్నించాలన్నారు.
ఈ విషయాన్ని కాగ్ కూడా బహిర్గతం చేసిందని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వడం లేదన్నారు. 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినా కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు.
కేంద్రం స్పందించకపోవడంతోనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు అంశాలపై ప్రైవేటు బిల్లు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. విశాఖ–చెన్నై కోస్తా కారిడార్, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, ధాన్యానికి గిట్టుబాటు ధర, వైద్య కళాశాలల ఏర్పాటు, కడప స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నం పోర్టులపై కేంద్రాన్ని ప్రశ్నించామన్నారు.