సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): కడప ప్రజల మనోభావాలను గాయపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు దారుణమని, ఇది ఆయన పార్టీ అజెండానా? లేక సొంత అజెండానా? అని ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయ ప్రాంగణంలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గడికోట మీడియాతో మాట్లాడుతూ.. ఆంగ్లేయుల హయాంలోనే కడపలో ఎయిర్‌పోర్టు ఉందనే విషయాన్ని ఇలాంటి కుహనా నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు.
మానవత్వం కడప సొంతం..
ఒక మనిషి ఆకలితో ఉంటే తట్టుకోలేని సంప్రదాయం.. తమ కడుపు మాడ్చుకొని ఇతరులకు అన్నం పట్టే సహృదయం కడప ప్రజల సొంతమని గడికోట పేర్కొన్నారు. సోము వీర్రాజు పద్ధతి మార్చుకోకుంటే తమ ప్రాంతంలో అడుగుపెట్టే హక్కును సైతం కోల్పోతారని హెచ్చరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కడప గూండాలు, రౌడీలు, పులివెందుల పంచాయతీ అంటూ చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. సీమలో ఆయా పార్టీల జెండాలు మోసే వ్యక్తులు ఇలాంటి కుహనా వ్యాఖ్యల పట్ల సిగ్గు పడాలన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కొంతమంది నాయకులు ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చారని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫ్యాక్షన్ వద్దు.. ఫ్యాషన్ ముద్దు నినాదాన్ని తీసుకొచ్చారని వివరించారు.
దిక్కుతోచకే బాబు విమర్శలు..
దేశంలో తానే సీనియర్ రాజకీయ నాయకుడినని తరచూ చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నట్లుగా ఉద్యోగుల సమస్యకు, జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో దిక్కుతోచని చంద్రబాబు ఈర‡్ష్యతోనే విమర్శలకు దిగుతున్నారని చెప్పారు.
బీజేపీ క్షమాపణ చెప్పాలి: వామపక్షాలు
రాయలసీమకు విమానాశ్రయాలు ఎందుకంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వాఖ్యలను వామపక్ష రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించాయి. ఈమేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీర్రాజు చేసిన అవమానకర వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే..
రాష్ట్రంలో బీజేపీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలో మత విద్వేషాలు, ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ విమర్శించారు. విజయవాడ లబ్బీపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని, విషప్రచారాల్లో నిమగ్నమై వికృత క్రీడ ఆడుతుందన్నారు.
చదవండి: ‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’
Comments
Please login to add a commentAdd a comment