చింతపల్లి: ‘రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగాలి.. అభివృద్ధి జరగాలి. రాజన్న రాజ్యం రావాలి..’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. ఉద్యమకారులను నమ్మి అధికారం ఇస్తే నట్టేట ముంచారని విమర్శించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని సమైక్యనగర్ కాలనీ, కుర్రంపల్లి ఎక్స్‌రోడ్డు, సాయిరెడ్డిగూడెం, మోద్గుల మల్లేపల్లి, పి.కె. మల్లేపల్లి, కిష్టరాయినిపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా పి.కె.మల్లేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు.
ధాన్యం కొనకపోవడంతో రైతుల్లో ఆందోళన
రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేయలేదని, ఇప్పుడు చేసినా అధిక వడ్డీకే సరిపోని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
వరికోతలు నడుస్తున్నా ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని, అసలు కొంటారో..కొనరో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. రాష్ట్రాన్ని బార్ల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల వృత్తులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మాట ముచ్చటలో భాగంగా పలువురు మహిళలు వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పడం తప్ప ఎవరికీ ఇవ్వలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, సురేష్‌రెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.
షర్మిలను కలిసిన విజయమ్మ
పాదయాత్రలో ఉన్న షర్మిలను వైఎస్ విజయమ్మ కలిశారు. బుధవారం మధ్యాహ్నం మోద్గుల మల్లేపల్లి గ్రామానికి చేరుకున్న విజయమ్మ సుమారు మూడు గంటల పాటు ఆమెతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment