​​​​​​​చౌదరి ఎక్కడ..? - | Sakshi
Sakshi News home page

​​​​​​​చౌదరి ఎక్కడ..?

Published Sat, Jul 22 2023 2:08 AM | Last Updated on Sat, Jul 22 2023 1:05 PM

- - Sakshi

ఒంగోలు టౌన్‌: గిరిజన యువకుడు మోటా నవీన్‌పై అత్యంత క్రూరంగా దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు మన్నెం రామాంజనేయులు చౌదరి ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉండగా వారిలో ఆరుగురికి ఇప్పటికే పోలీసులు సంకెళ్లు వేశారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దురాగతంలో కీలక పాత్ర పోషించిన రామాంజనేయులు చౌదరి మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడి కోసం రెండు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసిన పోలీసులు.. హైదరాబాద్‌, గుంటూరు తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నా ఆచూకీ లభించక పోవడం చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి గత నెల 19న నవీన్‌పై దాడి చేసిన తర్వాత చౌదరి నగరంలోని శివారు ప్రాంతంలో ఓ చర్చి వెనక ఉన్నట్లు సమాచారం. అవివాహితుడైన చౌదరి వెంట ఓ మహిళ, పదేళ్ల పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన తర్వాత నవీన్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తన మీద కేసు పెడితే చంపేస్తానని, తనకు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయని బెదిరించినట్లు స్థానికంగా చెప్పుకుంటున్నారు. గతేడాది కూడా నవీన్‌పై దాడి చేసి తల పగులగొట్టాడని బాధితుడు పోలీసులు, ఎస్టీ కమీషన్‌ సభ్యుడు వడితే శంకర్‌ నాయక్‌ ఎదుట చెప్పాడు.

అప్పుడు కూడా చౌదరి రాజకీయ, సామాజిక అండ చూసి భయపడిన నవీన్‌ కేసు పెట్టలేదని తెలుస్తోంది. తాజాగా గత నెల దాడి జరిగినప్పుడు కూడా నవీన్‌ పోలీసులకు అసలు ఏం జరిగిందన్నది చెప్పక పోవడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా చికిత్స పూర్తి కాకుండానే రిమ్స్‌ నుంచి వెళ్లిపోయాడు. ఇది మామూలు దాడిగానే పోలీసులు భావించారు.

వీడియో బయట పడిన తర్వాత కానీ అసలు నిజం వెల్లడి కాలేదు. ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడితో సన్నిహిత సంబంధాలు కలిగిన రామాంజనేయ చౌదరి అతడి సూచనలు, సలహాల మేరకే ఘటన జరిగిన నెల రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. సదరు నాయకుడి సంరక్షణలోనే తలదాచుకున్న రామాంజనేయులు చౌదరి.. పోలీసులకు చిక్కకుండా వారిని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడని నగరంలో ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement