ఒంగోలు:మట్టి గణపతిని పూజిద్దాం...పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన ‘చిన్నారుల చేతుల్లో మట్టిగణపతి’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శనివారం నగర పరిధిలోని సాయిబాబా సెంట్రల్ స్కూల్, క్విస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని మట్టి వినాయక ప్రతిమలు తయారు చేశారు.
సాయిబాబా సెంట్రల్ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి రాఘవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడమే కాకుండా కళాజాతాలతో సామాజిక చైతన్యం తీసుకొస్తున్నామన్నారు. కాలుష్య నివారణ సామాజిక బాధ్యతగా భావించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొచ్చిన ‘సాక్షి’ మీడియాకు, అదే విధంగా విద్యార్థులకు సాంకేతికతతో కూడిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పించిన సాయిబాబా సెంట్రల్ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు.
మట్టి గణపతిని పూజించాలనే ఆలోచన చిన్నతనం నుంచే ప్రారంభమైతే అది భవిష్యత్‌లో అద్భుతమైన పర్యావరణ హితానికి తోడ్పడుతుందన్నారు. ఈ ఆలోచనతోనే రేపటి పౌరులలో ఒక మంచి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సాయిబాబా సెంట్రల్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ జీవి భాస్కర్, ప్రిన్సిపాల్ ఎం.మహేష్ మాట్లాడుతూ ఒక మంచి అవగాహన కార్యక్రమానికి తమ స్కూలు వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. చిన్నతనంలో జరిగే కార్యక్రమాలు చిన్నారుల మనస్సులపై బలంగా ముద్రితమవుతాయని తద్వారా మార్పు తప్పక సాధ్యపడుతుందని ఆకాంక్షిస్తున్నామన్నారు.
అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మట్టి గణపతి తయారీపై విద్యార్థులకు అవగాహన కల్పించగా చిన్నారులు వినాయక ప్రతిమలను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రతిమలను అద్భుతంగా తీర్చిదిద్దిన మొదటి ఐదుగురికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ బ్రాంచి మేనేజర్ శివన్నారాయణ, సర్క్యులేషన్ మేనేజర్ పవన్‌కుమార్, ఎడిషన్ ఇన్‌చార్జి రవిచంద్ర, యాడ్స్ ఇన్‌చార్జి శేషిరెడ్డి, ఫొటో గ్రాఫర్ యం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో..
క్విస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌లో జరిగిన కార్యక్రమాన్ని క్విస్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ గాయత్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం నేడు సమాజానికి పెను సవాల్‌గా మారిందన్నారు. ఒక వైపు పెరుగుతున్న పారిశ్రామికీకరణ ఉపాధి అవకాశాలను పెంచుతుంటే రెండో వైపు అదే రంగం కాలుష్యాన్ని పెంచుతోందన్నారు. ఈ నేపథ్యంలో రెండింటి మధ్య సమతుల్యత ముఖ్యమని, అందుకు మనమంతా మొక్కలు పెంచడం ద్వారా వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచవచ్చన్నారు.
వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి వినియోగం తగ్గాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విగ్రహ తయారీపై విద్యార్థులకు అవగాహన కలిగించగా వారు బంక మన్నుతో విగ్రహాలను తయారు చేసి ఔరా అనిపించారు. ఈ సందర్భంగా మట్టి ప్రతిమలను అద్భుతంగా తయారు చేసిన ఐదుగురు విద్యార్థులకు బహుమతులు, మరో ఐదుగురికి మెమొంటోలు అందించారు. కార్యక్రమంలో క్విస్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ వై.హనుమంతరావు, క్విస్ ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దక్షిణామూర్తి, క్విస్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ కె.నాగరాజు, ‘సాక్షి’ బీఎం శివన్నారాయణ, సర్క్యులేషన్ మేనేజర్ పవన్‌కుమార్, యాడ్స్ అసిస్టెంట్ మేనేజర్ శర్మ, క్విస్ కాలేజీ ఏవో సుదర్శన్ తదితరులు పర్యవేక్షించారు.
చివరగా విజేతలకు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆర్.సుశీల బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణంపై నేడు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, మెరుగైన పర్యావరణ పరిస్థితులు ఉన్న చోట ఆరోగ్యకర వాతావరణం ఉంటుందన్నారు.
జలచరాల ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో చేసిన విగ్రహాలను సముద్రాలలో నిమజ్జనం చేసినప్పుడు జల కాలుష్యం పెరుగుతుంది. దీనివల్ల సముద్రంలో ఉండే జీవులు చనిపోవడం, వాటి ఉత్పత్తిపై ప్రభావం కనిపిస్తుంది. తద్వారా జలచరాల ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది. జల కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటి వినియోగాన్ని స్వచ్ఛందంగా మానుకునేందుకు ప్రజలు ముందుకు రావాల్సిన అవసరాన్ని తెలుసుకున్నా.
– యు.శివశంకర్, ద్వితీయ బహుమతి విజేత
Comments
Please login to add a commentAdd a comment