ఒంగోలు, సాక్షి ప్రతినిధి: కొండపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘భవిష్యత్‌కు బాబు గ్యారెంటీ’ కార్యక్రమం సాక్షిగా ఎమ్మెల్యే డోల శ్రీబాలవీరాంజనేయస్వామికి పార్టీ కేడర్ ఝలక్ ఇచ్చారు. కొండపి మండలం కట్టావారిపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఒక వైపు ఏర్పాట్లు జరుగుతుండగానే మరో వైపు రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం రచ్చకెక్కింది. చివరకు కార్యక్రమం ఆగిపోయిన దుస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే ఒక వర్గానికి కొమ్ము కాయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పార్టీ నాయకులు అంటున్నారు. వాస్తవానికి ఈ 14, 15 తేదీల్లో ‘భవిష్యత్‌కు బాబు గ్యారెంటీ ’ కార్యక్రమం కట్టావారిపాలెంలో నిర్వహిస్తున్నట్టు నేతలు ప్రకటించారు. స్వామి వర్గానికి చెందిన అనుమాల ప్రసాద్ కార్యక్రమ ఏర్పాట్ల బాధ్యతలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే సూచనల మేరకు హైదరాబాద్‌లో ఉండే ఇతను గ్రామానికి వచ్చి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇక్కడే నిప్పు రాజుకుంది. ఆ ప్రాంతంలో పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులకు కనీసం మాటవరసకై నా చెప్పకుండా ఏర్పాట్లు చేశారు. ఉన్నట్టుండి ఊరిలో ‘భవిష్యత్‌కు బాబు గ్యారెంటీ’ కార్యక్రమ ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని చూసి ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని ఉన్న కల్లూరి నరేంద్ర వర్గం విస్తుపోయింది. ‘‘ఎప్పటి నుంచో పార్టీకి విధేయులుగా ఉంటూ ఆర్థికంగా సహకరిస్తున్న మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా కార్యక్రమం ఏర్పాటు చేయమేంటి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే ఈ విషయాన్ని టీడీపీ నాయకుడు దామచర్ల సత్య దృష్టికి తీసుకెళ్లారు. అందరూ కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలు చేయాల్సి ఉండగా అనుమోలు ప్రసాద్ వేసిన ఫ్లెక్సీల్లో స్వామి అనుకూలవర్గానికి చెందిన వారి ఫొటోలు వేసి నియోజకవర్గంలోని మరో ముఖ్య నాయకుడు దామచర్ల సత్య వర్గానికి చెందిన వారి పేర్లు వేయకపోవడం సరికాదని మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ మండల అధ్యక్షుడు బొడపాటి యలమందనాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన సమస్యను ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య దృష్టికి తీసుకుని వెళ్లి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవటంతో ‘భవిష్యత్‌కు బాబు గ్యారంటీ’ కార్యక్రమం కట్టావారిపాలెం ప్రజలకు గ్యారంటీ ఇవ్వకుండానే అర్ధంతరంగా ఆగిపోయింది.
పార్టీలో కష్టపడుతున్న తమకు ముందు గ్యారంటీ ఇచ్చి తరువాత ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలని ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్యను టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుమోలు ప్రసాద్ పార్టీలో చేరి ఎమ్మెల్యే స్వామి అండదండలతో కాంట్రాక్టులు పొంది లాభాలు గడించాడని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకుంటున్నాడని ఆ పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే కొమ్ముకాయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
ఇది ఒక్క కట్టావారిపాలెం గ్రామానికే పరిమితం కాలేదు.. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అవసరం వచ్చినప్పుడు తమను వాడుకుంటూ ఆ తర్వాత నిర్లక్ష్యం చేయడం ఎమ్మెల్యేకు పరిపాటిగా మారిందని పార్టీ నాయకులు బహిరంగంగా ఆరోపించడం గమనార్హం. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో తామేంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే స్వామి భవిష్యత్‌కు బీటలు పడ్డాయని పార్టీ నేతలే అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment