
ఆత్మ గౌరవం శూన్యం.. అవమానమే నిత్యం!
కనిగిరి రూరల్:
గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ హయాంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు సచివాలయ వ్యవస్థపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించారు. వారికి బీజేపీ, జనసేన నేతలూ వంతపాడారు. సచివాలయాలు ఎందుకు? అవి అసలు ఉద్యోగాలే కావంటూ అవహేళన చేశారు. అయితే, ఆ సచివాలయాల ఉద్యోగులే నేడు కూటమి ప్రభుత్వానికి దిక్కుగా మారారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మూడ నెలలుగా మొదటి రోజే 95 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేశామని గొప్పలు చెప్పడం వెనుక ఉన్నది సచివాలయ ఉద్యోగుల కష్టమే అనేది జగమెరిగిన సత్యం.
సేవలు కుదింపు.. పనిభారం పెంపు
గత ప్రభుత్వంలో జిల్లాలోని 38 మండలాల్లో 719 గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7200 మంది వరకు ఉద్యోగులు ప్రజలకు సేవలందిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు.. సచివాలయ ఉద్యోగులను కూర్చోబెట్టి జీతాలిస్తున్నారంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఈ సంగతి కాస్త పక్కనపెడితే.. ఇటీవల ఎన్నికల్లో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం సచివాయాల్లో సేవల సంఖ్యను కుదించింది. మళ్లీ సేవా కేంద్రాలు, సర్వీస్ సెంటర్లు అంటూ కొత్త రాగం తీసింది. సచివాలయ ఉద్యోగులను మాత్రం వీధుల్లోకి నెట్టి స్టిక్కర్లు అంటించాలని ఆదేశాలిచ్చింది.
ఆత్మగౌరవాన్ని కాపాడని ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైంది. ప్రభుత్వ శాఖలపై, క్షేత్ర స్థాయిలో ప్రజల స్థితిగతులపై అవగాహన కలిగిన సచివాలయ ఉద్యోగులను ఎలా వినియోగించుకోవాలనే విషయమై శాస్త్రబద్దంగా ఆలోచించాల్సిన ప్రభుత్వం.. అదేమీ లేకుండా స్టిక్కర్లు అతికించే పనికి వారిని వినియోగించడంపై ప్రజల నుంచీ విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్టిక్కర్లు అంటించేందుకు వెళ్తుండటంతో ప్రజల్లో తమపై చులకనభావం ఏర్పడిందని సచివాలయ ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులతో రేషన్ కార్డులు, నూతన పింఛన్లు, నూతన ఆరోగ్య శ్రీ కార్డు ఒక్కటంటే ఒక్కటి కూడా పంపిణీ చేయించలేదు.
ఆది నుంచీ వ్యతిరేక వైఖరే..
కూటమి ప్రభుత్వంలోని రాజకీయ నేతలు ఆది నుంచి సచివాలయ, వలంటీర్ల వ్యవస్థపై వ్యతిరేక వైఖరినే అవలంబించారు. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం,, సచివాలయ ఉద్యోగులను చులకన భావంతో చూస్తోందన్న అపవాదును వంద రోజుల్లోనే మూటగట్టుకుంది. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసి ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే గుర్తించాలని వలంటీర్లను, స్థానిక ప్రజాప్రతినిధులను ఇంటింటికీ పంపి వివరాలు సేకరించి, ఆ ఇంటి యజమాని అంగీకారంతో కరపత్రాన్ని అందజేసి ఇంటి గోడకు స్టిక్కర్ అంటించే కార్యక్రమం చేపట్టింది. దీనిని అప్పుడు విమర్శించిన వారంతా.. అధికారంలోకి రాగానే ఉద్యోగులను అలాంటి పనులకు వినియోగించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రజలకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రాజకీయ ప్రచార కార్యక్రమాలకు వినియోగించడం ఎంతవరకూ సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.జిల్లాలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలతో ప్రజలు త్వీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇంటింటికీ తిరిగి వైద్యసేవలు అందించాల్సిన వైద్య సిబ్బందిని సైతం కరపత్రాలు పంచేందుకు, స్టిక్కర్లు అంటించేందుకు వినియోగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నత సేవల నుంచి
వీధుల్లోకి సచివాలయ ఉద్యోగులు
నాడు ప్రతిపక్షంలో ఉండగా వెక్కిరించి..
నేడు వారే దిక్కనే స్థితికి..
ఒకటో తేదీ నూరు శాతం పింఛన్ల పంపిణీ వారి దయే..
ఇళ్లకు స్టిక్కర్లు అంటించే పనిపై ఉద్యోగుల్లో మనోవేదన
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టింది
టీడీపీ అంటూ వేదికలపై తరచూ ఊదరగొట్టే
ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు..
ఉద్యోగులను వీధుల్లోకి నెట్టి వారి ఆత్మగౌరవంపై దెబ్బకొట్టారన్న విమర్శలు అన్ని వర్గాల
నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులైన సందర్భంగా
అప్పగించిన బాధ్యతలు ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టాయి. ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు అత్యుత్సాహంతో చేస్తున్న పనులు క్షేత్ర స్థాయిలో ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని ఆందోళన
చెందుతున్నారు.

ఆత్మ గౌరవం శూన్యం.. అవమానమే నిత్యం!

ఆత్మ గౌరవం శూన్యం.. అవమానమే నిత్యం!