కనిగిరి రూరల్: విద్యుదాఘాతంతో ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలోని పునుగోడులో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో పెద్ద మనిషిలా వ్యవహరించే తోట చిన వెంకట నరసయ్య (69) మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో అందరి సహకారంతో అభయాంజనేయస్వామి గుడి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతలు ఇచ్చిన విరాళాల వివరాలతో కూడిన ఫ్లెక్సీని గుడి వద్ద ఏర్పాటు చేశారు.
పండుగ ముగియడంతో ఆంజనేయస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫ్రేమ్ తొలగించేందుకు తోట వెంకట నర్సయ్య, కల్లూరి కొండయ్య వెళ్లారు. ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేం తొలగించే క్రమంలో బరువుకు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మపై పడింది. దీంతో తోట వెంకట నర్సయ్య (69) కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అతని కుడి కాలు, కుడి చేయి పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో వ్యక్తి కే కొండయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై టి.శ్రీరాం ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే వెంకట నర్సయ్య నిమిషాల వ్యవధిలో మృత్యుఒడికి చేరడంతో పల్లె జనం శోక సంద్రంలో మునిగిపోయారు. వెంకట నర్సయ్య భౌతిక కాయాన్ని వైస్ ఎంపీపీ లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, పలువురు నాయకులు, గ్రామ పెద్దలు సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment