
మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలి
● కలెక్టర్ తమీమ్‌అన్సారియా
ఒంగోలు సిటీ: మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ప్రారంభమైన అవగాహన ర్యాలీ రిమ్స్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీని కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు మహిళలు, హక్కుల సాధికారతపై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, డీసీపీఓ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రజకులంటే కక్ష ఎందుకు చంద్రబాబు ?
ఒంగోలు టౌన్: జీవో నెంబర్ 24 ద్వారా లాండ్రీలకు ఇచ్చే 150 యూనిట్ల ఉచిత విద్యుత్, 75 జీవో ద్వారా దోభీఘాట్లకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌కు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం కూటమి ప్రభుత్వం రజకుల పట్ల వివక్ష చూపుతుందనడానికి నిదర్శనమని రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ రెండు జీవోలను బడ్జెట్లో తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రజకులంటే ఎందుకు కక్షో తెలపాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తెలుగు దేశం ప్రభుత్వం రజకులకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడని హామీలను నెరవేర్చే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం రజకులకు మేలు చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. ఈనామ్ భూములు అన్యాక్రాంతంపై కూటమి పాలకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. జగనన్న టౌన్‌షిప్పుల్లో సేకరించిన కమ్యూనిటీ స్థలాల్లో రజకుల వృత్తి అవసరాలకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తే ప్రభుత్వం పై పడే ఆర్థిక భారం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో రజకులు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు.
బడ్జెట్ ప్రతుల దహనం
మార్కాపురం టౌన్: బడ్జెట్‌లో వెలుగొండ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపడాన్ని నిరశిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్‌లో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయకులు అందె నాసరయ్య, రఫీ, సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వెలుగొండకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరినా కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. ఏ మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా రూ.2 వేల కోట్లు కేటాయించాలని, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, మొదటి టన్నెల్ ద్వారా ఈ ఏడాది వరద సీజన్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీల నాయకులు జి.బాలనాగయ్య, ఎస్‌కే ఖాశీం, జవ్వాజి రాజు, రూబెన్, నన్నేసా, సురేష్ కుమార్, కాశయ్య, చిత్తారి పెద్దన్న, అల్లూరయ్య పాల్గొన్నారు.

మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలి
Comments
Please login to add a commentAdd a comment