● సమన్వయకర్తగా పఠాన్ కరిముల్లా ఖాన్
ఒంగోలు వన్‌టౌన్: ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కోసం ముస్లిం స్టీరింగ్ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. ఒంగోలు బండ్లమిట్టలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్‌డీ సర్దార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ముస్లిం నాయకులు మాట్లాడుతూ ముస్లిం హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారానికి నగరంలోని ముస్లింలు అందరూ ఒకే తాటిమీదకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు నగరంలో సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని ముస్లిం శ్మశాన వాటిక, షాదీఖానా నిర్వహణ, ఉర్దూ పాఠశాల ఏర్పాటు వంటివి పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. ముస్లింలకు న్యాయంగా అందాల్సిన సంక్షేమం, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం, హక్కుల సాధన కోసం ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం అని అన్నారు. నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని ముస్లింలందరినీ చైతన్య పరిచి యాక్షన్ కమిటీ ఏర్పాటు కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. సభ్యులుగా ప్రజా సంఘాల నాయకులు ఎస్‌డీ ఇస్మాయిల్, ఎండీ రఫీ అహ్మద్, ఎస్‌కే అబ్దుల్ రవూఫ్, మహ్మద్ రఫీ, ఎస్‌డీ హుస్సేన్, ఎస్‌డీ కరీముల్లా, ఎంఏ సాలార్, ఎస్‌డీ ఇలియాజ్‌లను వ్యవహరిస్తారు. సలహాదారులుగా ఎస్‌డీ సర్దార్, ఎస్‌కే కరీముల్లా, ఎస్‌కే మహబూబ్ భాయ్‌లు వ్యవహరిస్తారు. కార్యక్రమంలో ఎస్‌కే షబ్బీర్, ఎస్‌కే కరీం, ఎస్‌కే ఖాదర్ వలి, ఎస్‌డీ సలీం, ఎస్‌కే గౌస్ భాషా, ఎస్‌కే ఫయాజ్, ఎస్‌డీ సమద్, పఠాన్ గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment