వెట్టి చాకిరీ బందీలకు విముక్తి
ఒంగోలు సిటీ: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ వద్ద ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న యానాది కుటుంబాలకు జిల్లా అధికారుల చొరవతో విముక్తి లభించింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన 5 ఎస్టీ(యానాది) కుటుంబాలను నరసరావుపేట ప్రాంతంలో కర్ర కోత కోసం పదేళ్ల క్రితం ఓ కాంట్రాక్టర్ తీసుకెళ్లాడు. అందుకుగాను వారికి కొంత నగదును అడ్వాన్స్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి వారిని అక్కడే బందించి వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. కర్ర కోతకు వెళ్లిన ఆ కుటుంబాలను కాంట్రాక్టర్ వేధిస్తున్న తీరును బాధితుల బంధువులు భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా బాషాకు వివరించారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియాకు గత నెలలో ఫిర్యాదు చేయగా ఒంగోలు ఆర్డీఓతో విచారణ చేయించారు. బాధిత కుటుంబాలకు విముక్తి కల్పించగా మంగళవారం కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఓ కాంట్రాక్టర్ వద్ద బందీలుగా ఉన్న మరో మూడు కుటుంబాలు తప్పించుకుని వచ్చాయి. వీరందరికీ ఆధార్ కార్డులు మంజూరు చేయడంతోపాటు పౌష్టికాహారం అందించి, పిల్లలకు చదువు చెప్పిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భారతీయ జనతా మాజ్దూర్ సెల్ కార్యదర్శి షేక్ సిద్ధాంబీ, యానాది సంఘ నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment