కన్నవారికి కడుపుకోత
కురిచేడు: అన్నదమ్ముల ఈత సరదా వారి తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చింది. ఈత కొట్టేందుకు చెరువులో దిగి లోతైన గుంతలో చిక్కుకుని నీటిలో మునిగి ఇద్దరు సోదరులు మృతిచెందారు. ఈ సంఘటన కురిచేడు మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కురిచేడులోని పడమరహరిజనవాడకు చెందిన బత్తుల నరసింహారావు, కల్పన దంపతుల కుమారులు బత్తుల అభి (10), బత్తుల పాల్ (8) మధ్యాహ్న సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు హరిజనవాడ పక్కనే ఉన్న చిన్నచెరువు వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. అయితే, అక్కడ లోతైన గుంత ఉండటంతో నీటిలో మునిగి మృతిచెందారు. మరో బాలుడు మాలపోలు నాని భయపడి ఇంటికొచ్చి పెద్దలకు చెప్పడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి అభి, పాల్ మృతదేహాలను బయటకు తీశారు. తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు.
అన్న కోసం తమ్ముడు దూకి...
ఉదయం పాఠశాలకు వెళ్లి ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నానికి ఇంటికొచ్చిన అభి, పాల్ పుస్తకాలు ఇంట్లో పెట్టి బహిర్భూమికని చెప్పి పక్కనే ఉన్న చిన్న చెరువు వద్దకు వెళ్లారు. ముందుగా అభి ఈత కొడదామంటూ తమ్ముడికి చెప్పి చెరువులో దూకాడు. కానీ, ఎంతసేపటికీ బయటకు రాలేదు. దాంతో భయపడిన పాల్ పరిగెత్తుకుంటూ హరిజనవాడ వచ్చి అతని స్నేహితుడు మాలపోలు నానికి జరిగిన విషయం చెప్పి చెరువు వద్దకు తీసుకెళ్లాడు. నాని చూస్తుండగానే పాల్ కూడా తన అన్న కోసం చెరువులో దూకాడు. ఇద్దరూ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో నాని ఇంటికొచ్చి అభి, పాల్ కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్ల సాయంతో గాలించగా, చెరువులోని లోతైన గుంతలో చిన్నారులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వారిని బయటకు తీసి ఇంటికి తరలించారు. తల్లిదండ్రులకు వీరిద్దరే సంతానం కాగా, తండ్రి నరసింహారావు బేల్దారి పనులు చేస్తుంటాడు. తల్లి కల్పన పొలం పనులకు వెళ్తుంటుంది. కూలీనాలీ చేసుకుని బిడ్డలను పాఠశాలకు పంపి చదివిస్తున్నారు. బత్తుల అభి 4వ తరగతి, పాల్ 3వ తరగతి చదువుతున్నారు. పెరిగిపెద్దయ్యాక తమకు అండగా ఉంటారనుకున్న పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో చేరుకుని కంటతడి పెట్టారు. పడమర హరిజనవాడ మొత్తం విషాదం అలముకుంది.
చెరువులో ఈతకు వెళ్లి అన్నదమ్ముల మృతి కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు, బంధువులు
కన్నవారికి కడుపుకోత
కన్నవారికి కడుపుకోత
Comments
Please login to add a commentAdd a comment