మెడికల్ షాపుల్లో విజిలెన్స్ దాడులు
ఒంగోలు టౌన్: జిల్లాలో విజిలెన్స్ దాడులతో మెడికల్ షాపు యజమానులు హడలెత్తిపోయారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, నిషేధిత మందులు విక్రయించడం లాంటి ఫిర్యాదులు రావడంతో ఈగల్ టీమ్, విజిలెన్స్ అధికారులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు, మార్కాపురం, కంభం, టంగుటూరు మెడికల్ షాపుల్లో 10 చోట్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. మందుల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించకపోవడం, వినియోగదారులకు బిల్లులు చెల్లించకపోవడం, అల్ప్రాజోలాం, కోడిన్ దగ్గు మందు, గర్భస్రావ ఔషధాలను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయించడం తదితర కారణాలపై 10 మెడికల్ షాపులకు నోటీసులు జారీ చేశారు.
ముందస్తు సమాచారంతో
షాపుల మూసివేత...
అయితే విజిలెన్స్ దాడులు జరగనున్నట్లు డ్రగ్ కంట్రోల్ కార్యాలయం నుంచి మెడికల్ షాపులకు ముందస్తు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో నగరంతో పాటుగా జిల్లాలోని అనేక మండలాల్లో మెడికల్ షాపులను మూసివేశారు. నెలవారీ ముడుపులకు అలవాటు పడిన డ్రగ్ కంట్రోల్ కార్యాలయ సిబ్బంది నిర్వాకంతో మెడికల్ యజమానులు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో విజిలెన్స్ టీమ్ తనిఖీలు నామ మాత్రంగా జరిగినట్లయిందని ప్రచారం సాగుతోంది. డ్రగ్ కంట్రోల్ అధికారుల వివరణ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment