
పట్టపగలే మూడు గృహాల్లో చోరీ
పామూరు: మండల కేంద్రం పామూరు ఎన్‌జీఓ కాలనీ 5వ లైన్‌లో ఓ ఇంట్లో, నేతాజీనగర్ ఒకటో లైన్ సమీపంలోని ఒకే నివాస గృహంలో వెనుక, ముందు వైపు ఇళ్లలో శనివారం ఉదయం వరుస చోరీలు చోటుచేసుకున్నాయి. మండలంలోని దూబగుంట్ల మాజీ సర్పంచ్ మితికాల గురుస్వామి నేతాజీనగర్ 1వ లైను సమీపంలో నివాసం ఉంటున్నాడు. పనిపై గురుస్వామి నెల్లూరు వెళ్లగా అతని కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల కోసం ఉదయం 9 గంటల తర్వాత ఆస్పత్రికి వెళ్లి 12 సమయంలో తిరిగి ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటి ప్రధాన డోర్, బీరువా తాళాలు, కబోర్డ్‌లు పగులగొట్టి ఉన్నాయి. నగదు, వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. నగదు రూ.1.5 లక్షలు, 64 గ్రాముల నగలు చోరీకి గురైనట్లు తెలిపారు. అదే ఇంట్లో బాడుగకు ఉంటున్న రమణారెడ్డి కుటుంబ సభ్యులు పనిపై బయటకు వెళ్లి 11.30 గంటల సమయంలో తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా కబోర్డ్‌లో ఉన్న రూ.18 వేల నగదు మాయమైనట్లు చెప్పారు. సమీపంలోని ఎన్‌జీఓ కాలనీ 5వ లైన్‌లో నివాసం ఉంటున్న బి.కోటేశ్వరరావు, అతని భార్య ఉపాధ్యాయులు. ఇద్దరూ ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లారు. వారి పిల్లలు కూడా పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కోటేశ్వరరావు ఇంటికి వచ్చి చూసే సరికి గ్రిల్ తాళాలు, ప్రధాన డోర్, బీరువా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని మొత్తం 12 గ్రాముల ఉంగరం, పాపటి బిళ్ల, ముక్కుపుడకలు రెండు, రూ.2 లక్షల నగుదు చోరీకి గురైనట్లు గుర్తించారు. చోరీలపై గురుస్వామి, కోటేశ్వరరావు, రమణారెడ్డిలు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి సంఘటన స్థలాలను ఎస్సై టి.కిషోర్‌బాబు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలించి వివరాలు సేకరిస్తున్నాయి. చోరీ సమయంలో ఓ కార్ ఆ ప్రాంతంలో సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. పట్టపగలే చోరీలు జరగడంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
రూ.3.68 లక్షల నగదు, 76 గ్రాముల బంగారం మాయం
Comments
Please login to add a commentAdd a comment