
కుటుంబాన్ని హతమార్చేందుకు యత్నం
అర్థవీడు (బేస్తవారిపేట): పాతకక్షల నేపథ్యంలో ఓ కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రయత్నించిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి అర్థవీడు మండలంలోని బొమ్మిలింగం గ్రామంలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న గోదేసి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఇంటి సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ సర్వీస్ తీగను నిందితులు తొలగించారు. ఆ తీగపైన ఉండే ప్లాస్టిక్ మెటీరియల్‌ను కూడా తొలగించి ఇంటి వెనుక వైపున్న డోర్, బాత్ రూమ్ వద్ద తీగను పడేశారు. శనివారం తెల్లవారుజామున రాజేంద్రప్రసాద్ తల్లి నరసమ్మ బాత్‌రూంకు వెళ్లేందుకు తలుపు తీయగానే స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలి పెద్దగా కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు గమనించి అప్రమత్తం కావడంతో అందరికీ ప్రమాదం తప్పింది. ఎవరో తమ కుటుంబాన్ని హతమార్చేందుకు విద్యుత్ తీగలు తెచ్చి పడేసినట్లు వారు గుర్తించారు. రెండేళ్ల క్రితం పొలంలో స్టార్టర్ పెట్టెకు విద్యుత్ సరఫరా చేసి తమను చంపేందుకు కుట్ర పన్నారని, ఆ సమయంలో అదృష్టవశాత్తూ స్టార్టర్‌పై గోతం తొలగించే సమయంలో స్వల్ప విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని వారు తెలిపారు .తొమ్మిది నెలల క్రితం ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో కత్తితో పొడిచినట్లు బాధితులు తెలిపారు. ఈ కేసుల్లో నిందితులు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారని, వారే తమను చంపేందుకు శుక్రవారం అర్ధరాత్రి కూడా విద్యుత్ తీగల ద్వారా కుట్ర పన్నారని బాధితుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సుదర్శన్‌యాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment